త‌మిళ‌నాడు రాష్ట్రంలో  జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్‌, ఆయ‌న మ‌ధులిక‌తో పాటు మొత్తం 13 మంది క‌న్నుమూసిన విష‌యం విధిత‌మే. ఇవాళ బిపిన్‌రావ‌త్‌, ఆయ‌న భార్య మ‌ధులిక‌, ఇత‌ర భ‌ద్ర‌తా ద‌ళాల సిబ్బంది భౌతిక‌కాయాల‌ను త‌మిళ‌నాడు నీల‌గిరి జిల్లాలోని మ‌ద్రాస్ రెజిమెంట‌ర్ సెంట‌ర్ నుంచి సుల్లూరు ఎయిర్‌బేస్‌కు అంబులెన్స్‌ల‌లో త‌ర‌లించారు. బిపిన్ రావ‌త్ దంప‌తుల పార్థివ‌దేహాలు ఒక అంబులెన్స్‌లో, మిగ‌తా 11 మంది పార్థివ‌దేహాలు మ‌రొక అంబులెన్స్ వాహ‌నంలో త‌ర‌లించారు. అయితే సుల్లూరు నుంచి మొత్తం 13 భౌతిక‌కాయాలు ఇవాళ భార‌త వైమానిక ద‌ళం సూప‌ర్ హెర్య్యూల‌స్ ర‌వాణా విమానంలో న్యూఢిల్లీకి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేసారు.

ఈ త‌రుణంలోనే అంబులెన్స్‌ల‌లో సుల్లూరు ఎయిర్‌బేస్‌కు త‌ర‌లిస్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. అంబులెన్స్‌లు వ‌రుస‌గా వెళ్లుతున్న క్ర‌మంలో ముందు ఉన్న వాహ‌నాన్ని వెనుక ఉన్న అంబులెన్స్ ఒక్క‌సారిగా ఢీ కొట్టింది. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌త‌తో ప్ర‌మాదం తృటిలో త‌ప్పిన‌ది. కోయంబ‌త్తూరు మెట్టుపాళ‌యం వ‌ద్ద జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌లో అంబులెన్స్ డ్రైవ‌ర్‌కు స్వ‌ల్ప గాయాలు అయ్యాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. ముందు ఉన్న అంబులెన్స్‌ను వెనుక ఉన్న వాహ‌నం ఢీ కొట్ట‌డంతో డ్రైవ‌ర్‌కు స్వ‌ల్ప‌గాయాలు అయ్యాయి.

గాయాలు అయిన‌ డ్రైవ‌ర్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి.. ఆ త‌రువాత వేరే అంబులెన్స్‌ను తెప్పించి పార్థివ‌దేహాల‌ను మార్చి అక్క‌డి నుంచి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను సుల్లూర్ ఎయిర్‌బేస్ నుంచి ప్ర‌త్యేక విమానంల ఢిల్లీకి త‌ర‌లించారు. మ‌రికొద్ది సేప‌ట్లోనే పాలం టెక్నికల్ ఏరియాలో జనరల్ రావత్, ఆయన భార్య మ‌ధులిక తోపాటు మరొక  11 మంది సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త‌దిత‌ర ప్ర‌ముఖులు నివాళులర్పించనున్నారు. హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఇప్పటికే భారత వైమానిక దళం విచారణకు ఆదేశించిన‌ది. ఇదిలా ఉండగా బిపిన్ రావత్, ఆయన సతీమణి భౌతికకాయాలకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: