సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తో సహా హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం అనంతరం హెలికాప్టర్ ఇంధనం లీకై పూర్తిగా మంటల్లో కాలిపోవడంతో మరణించిన వారి మృత దేహాలను గుర్తించడం ఇప్పుడు కష్టతరంగా మారింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న త్రిదళాధిపతి అయిన బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక మృతదేహాలను మాత్రం సులభంగానే గుర్తించగలిగారు. వీరిద్దరితో పాట బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ మృతదేహాన్ని మాత్రమే ప్రస్తుతానికి గుర్తించారు. మిగిలిన అధికారుల మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు త్వరితగతిన ఏర్పాట్లు చేస్తున్నారు.

సీడీఎస్ బిపిన్ రావత్ ను కాపాడేందుకు చివరి క్షణం వరకూ ప్రయత్నించినా వీలు కాలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఆయనను తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో వైపు అయన సతీమణి మధులిక మాత్రం ప్రమాద స్థలంలోనే మరణించారు. ఇక మిగిలిన వారిని గుర్తించడం ఇప్పుడు ఆర్మీ ఉన్నతాధికారులకు సవాల్ గా మారింది. ఇప్పటికే మూడు రోజులు కావడంతో మృతి చెందిన అధికారుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. తమ వారిని చివరి చూపు చూసుకునేందుకు కన్నీటితో ఎదురు చూస్తున్నారు. బంధువులంతా మరణించిన కుటుంబ సభ్యులను మృతదేహం ఎప్పుడొస్తుందని అడుగుతుంటే చెప్పలేక తల్లడిల్లిపోతున్నారు.

త్రిదళాధిపతి బిపిన్ రావత్, మధులిక మృతదేహాలను మాత్రం ఇప్పటికే అంత్యక్రియల కోసం వారి కుటుంబ సభ్యులకు అప్పగించేశారు. అయితే మిగిలిన వారి మృతదేహాల గుర్తింపుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మంటలు పూర్తిగా వ్యాపించడంతో శరీరభాగాలు పూర్తిగా కాలిపోయాయి. మరికొందరి శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో.. డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల డిఎన్ఏ తో సరిపోల్చి.. ఆ తర్వాత సైనిక లాంఛనాల ప్రకారం మృతదేహాలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: