ఒమిక్రాన్ వేరియంట్ కు మందు తయారు చేసినట్టు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య చెప్పారు. ఒమిక్రాన్ సోకిన రోగులు తనను సంప్రదిస్తే తానే స్వయంగా వచ్చి వైద్యం చేస్తానని తెలిపారు. 48గంటల్లో వ్యాధిని నయం చేస్తానని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ఉన్న పేషెంట్లకు మందు కావాలని వారి బంధువులు సంప్రదించినా ఔషధాన్ని ఉచితంగా పంపిస్తానని చెప్పారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వణుకు పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన మహిళలో ఈ కొత్త వేరియంట్ బయటపడింది. బాధిత మహిళకు ఈ నెల 12న కరోనా పాజిటివ్ వచ్చింది. తర్వాత ఆమె టెస్ట్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించగా.. నేడు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. బాధితురాలి కుటుంబ సభ్యులందరికీ కరోనా నెగిటివ్ వచ్చింది. అంతేకాదు ఏపీలో గత 24గంటల్లో 28వేల 760కరోనా టెస్టులు చేయగా.. 103మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న కరోనాతో ఇద్దరు మరణించగా.. 175మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20లక్షల 76వేల 77కు చేరగా ఇప్పటి వరకు 14వేల 483 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,358 యాక్టివ్ కేసులున్నాయి. ఇక రాష్ట్రంలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.  

ఇక తెలంగాణ రాష్ట్రంలో సైతం మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ హయత్ నగర్ కు చెందిన 23ఏళ్ల యువకుడు ఇటీవల సుడాన్ నుంచి వచ్చాడు. అయితే అతడికి ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. దీంతో హయత్ నగర్ వాసులు ఉలిక్కిపడ్డారు. మరోవైపు అతడి చికిత్స కోసం టిమ్స్ ఆసుపత్రికి తరలించిన అధికారులు ప్రైమరీ కాంటాక్ట్ లను గుర్తించి టెస్టులు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు చేరింది.

ఇక మన దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 6వేల 317కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా మరో 318మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రస్తుతం రికవరీ రేటు 98శాతానికి పైగా ఉంది. తాజాగా కరోనా నుంచి 6వేల 906మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 78వేల 190 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటి వరకు 138.95కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: