నిజ‌మే.. ఇందులో అతిశ‌యోక్తి ఏమీలేదు. కొరియ‌న్ కంపెనీల ఉత్ప‌త్తులు ప్ర‌పంచ మార్కెట్ లో నెమ్మ‌దిగా అధిక వాటాను కైవ‌సం చేసుకుంటున్నాయి. వీటి పోటీకి జ‌పాన్ స‌హా ఇత‌ర దేశాల కంపెనీలు సైతం దిమ్మెర‌పోతున్నాయి. మ‌న‌దేశంలో అయితే పెద్ద మార్కెట్ వాటా ఈ దేశ కంపెనీల‌దే. ఎక్క‌డిదాకానో ఎందుకు..? మ‌న ఇంట్లో వాడే సామ్ సంగ్  ఫోన్ తీసుకోండి, లేదా టీవీ చూడండి..ఇంకా గ‌దిలో మూల ఉన్న అదే కంపెనీ ఫ్రిడ్జి చూడండి.. లేదా ఎల్జీ వాషింగ్ మెషిన్ వంక ఓ సారి దృష్టి సారించండి.. ఇవ‌న్నీ త‌యారు చేసే కంపెనీలు ఏ దేశానివో తెలుసా..? అవును ద‌క్షిణ కొరియాకు చెందినవే. అంతేకాదు.. దేశీయ కార్ల మార్కెట్ లో అత్య‌ధిక వాటా సాధించే దిశ‌గా దూసుకు వెళుతున్న హుండ‌య్ కంపెనీ కూడా ద‌క్షిణ కొరియాదే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొట్ట‌మొద‌ట‌గా ఏర్పాటైన కార్ల త‌యారీ ప‌రిశ్ర‌మ కూడా ఆదేశానికి చెందిన‌దే. ఇప్పుడు కియా కార్లు దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మ‌న దేశంలో మాత్ర‌మే కాదు.. అన్ని దేశాల్లోనూ త‌మ నాణ్య‌మైన ఉత్ప‌త్తుల‌తో సౌత్ కొరియ‌న్ కంపెనీలు పాగా వేస్తున్నాయి.
   
        ప్రపంచంలో మొద‌టి పారిశ్రామిక విప్ల‌వం మొద‌లైంది యూరోపియ‌న్ దేశాల్లోనే. అందుకే అవి ప్ర‌పంచాన్ని శాసించ‌గ‌లిగాయి. త‌రువాతకాలంలో ఆ దేశాల ప్ర‌జ‌లు వ‌ల‌స వెళ్లి అభివృద్ధి చేసిన ఉత్త‌ర అమెరికా దానిని మ‌రింత ముందుకు తీసుకువెళ్ల‌డ‌మే కాదు. పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థ‌కు బ‌ల‌మైన పునాది వేసి, ప్ర‌పంచాన్ని శాసించే అగ్ర‌దేశంగా నిలిచింది. కార్లు, విమానాల నుంచి కంప్యూట‌ర్ ల దాకా  మొద‌ట‌గా ఉత్ప‌త్తి చేసింది అమెరికా. ఈ ఉత్ప‌త్తుల త‌యారీలో పాశ్చాత్త దేశాల ప్రాభ‌వాన్ని తొలిసారిగా దెబ్బ కొట్టిన తొలి ఆసియా దేశం జ‌పాన్‌. ఆ దేశానికి చెందిన సుజుకీ, హోండా త‌దిత‌ర కంపెనీలు ఉత్ప‌త్తి చేసిన కార్లతో పోటీ ప‌డ‌లేక ఒక ద‌శ‌లో అమెరికాకు చెందిన ప‌లు కార్ల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు మూత‌పడ్డాయంటే జ‌పాన్ హ‌వా ఎలా న‌డిచిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు జ‌పాన్ కంపెనీల‌కు సైతం ద‌డ పుట్టిస్తున్న దేశంగా సౌత్ కొరియా ఎదిగింది. ఈ దేశం పారిశ్రామికంగా ఇలా వెలుగుతుండ‌గా దాని పొరుగు దేశం నార్త్ కొరియా మాత్రం నియంత‌ల బారిన‌ప‌డి, కేవ‌లం బొగ్గు, ఐర‌న్ ఓర్, ఆయుధాలు ఎగుమ‌తి చేసుకునే దేశంగా మిగిలిపోవ‌డం విషాదం.

మరింత సమాచారం తెలుసుకోండి: