తిరుమలలో వీఐపీ దర్శనాల విషయంలో ఎప్పుడూ సామాన్య భక్తులు ఇబ్బంది పడుతూనే ఉంటారు. టీటీడీ వీఐపీల సేవలో తరిస్తోందనే విమర్శ ఇప్పటిది కాదు. ప్రభుత్వాలు మారినా, అక్కడి పద్ధతుల్లో మాత్రం మార్పు లేదు. కానీ టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పద్ధితిలో చాలా మార్పు వచ్చిందని టీటీడీ చెబుతుంది. కానీ దానికి తగ్గట్టు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మారాయా లేదా అనేది మాత్రం అనుమానమే.

ఇటీవలే ఉదయాస్తమాన సేవల టికెట్ రేట్లు ప్రకటించిన తర్వాత టీటీడీ సామాన్య భక్తులకు మరింత దూరమైందనే అపవాదు వచ్చింది. మరోవైపు కరోనా సమయంలో కూడా తిరుమలలో భక్తులు చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిమితంగా టికెట్లు విడుదల చేయడం, దర్శనాలకోసం భక్తులు ఇబ్బంది పడటంతో విమర్శలు మొదలయ్యాయి. మరోవైపు భారీ వర్షాల సమయంలో కూడా భక్తులకు అసౌకర్యం కలిగిందనేమాట వాస్తవం. ఇక తాజాగా వైకుంఠ ఏకాదశి దర్శనాల విషయంలో కూడా టీటీడీపై విమర్శలు మొదలయ్యాయి.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు మొదలైన తొలిరోజే భక్తులు ఆలయం ఎదుట నిరసనకు దిగడం విశేషం. ఏకాదశి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తులు దర్శనాలకు వచ్చారు. అదే సమయంలో వీఐపీ కోటా కూడా పెంచడంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు క్యూ లైన్లో నుంచి రూమ్ లలోకి వదిలితే సాయంత్రం 8 గంటలకు వారిని దర్శనానికి అనుమతించారని సమాచారం. దీంతో దర్శనం తర్వాత బయటకు వచ్చిన భక్తులు టీటీడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీల సేవలో తరిస్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో కనీసం అల్పాహారం, ఇతర సౌకర్యాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. అప్పటికప్పుడు అధికారులు ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేసినా.. ముక్కోటి తొలిరోజే ఇలా సామాన్య భక్తుల ఆందోళన మాత్రం కలకలం రేపింది. ఉత్తర ద్వార దర్శనాలు మరికొన్నిరోజులు కొనసాగే పరిస్థితుల్లో ముందు ముందు టీటీడీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd