ప్ర‌జ‌లు ఎన్నోఆశ‌ల‌తో ఎదురుచూసిన 22-23 కేంద్ర బ‌డ్జెట్ వ‌చ్చేసింది. క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా ఒక‌టి ఆరా మిన‌హా అన్నిరంగాలూ కుదేలైన నేప‌థ్యంలో ఈ బ‌డ్జెట్ ఆర్థిక వ్య‌వస్థ తిరిగి పుంజుకునేందుకు చేప‌ట్టే చ‌ర్య‌ల‌పై అన్ని వ‌ర్గాలూ ఉత్కంఠ‌గా చూసినా మ‌రోసారి ఇది పేద మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల బాధ‌ల‌ను ప‌ట్టించుకోని బీజేపీ ప్ర‌భుత్వం ఇంత‌కు ముందు బ‌డ్జెట్‌ల త‌ర‌హాలోనే సాగిపోయింద‌ని చెప్పాలి. క‌రోనా పాండ‌మిక్ స‌మ‌యంలో జీడీపీ 2 శాతం పెరిగితే ప్ర‌భుత్వం ప‌న్నుల ఆదాయం 40 శాతం పెర‌గ‌డం విస్తు గొలిపే అంశ‌మేన‌ని చెప్పాలి. ఇది ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న‌ ఆర్థిక అస‌మాన‌త‌ల‌కు స్ప‌ష్ట‌మైన సంకేత‌మే. కాగా పూర్తిస్థాయిలో డిజిట‌ల్ క‌రెన్సీలోకి దేశాన్నిన‌డిపించేందుకు ప్ర‌భుత్వం ఈ బడ్జెట్‌లో మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంది. డిజిట‌ల్ పేమెంట్‌, నెట్ బ్యాంకింగ్ సేవ‌ల‌కు ఈ బ‌డ్జెట్‌లో ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించింది. న‌ల్ల‌ధ‌నాన్ని నిరోధించ‌డం, వ్యాపార లావాదేవీల్లో మ‌రింత పార‌దర్శ‌క‌త్వాన్ని పెంచ‌డం ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో క్రిప్టో క‌రెన్సీని నిషేధించ‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న‌లు తెర‌దించుతూ వాటికి సంబంధించిన లావాదేవీల‌పై 30 శాతం ప‌న్నును విధించింది. అంటే లాభంపై ప‌న్ను క‌ట్టాల‌న్న‌మాట‌. అయితే న‌ష్టం వ‌స్తే మాత్రం వాటిని ఫార్వ‌ర్డ్ చేసుకుని త‌రువాత సంవత్సరాల్లో ఫైల్ చేసుకునే అవ‌కాశం ఇవ్వ‌లేదు. అంటే నిషేధించ‌క‌పోయినా క్రిప్టో క‌రెన్సీని నియంత్రించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని చెప్పాలి. క్రిప్టో క‌రెన్సీ బిల్‌ను తీసుకురాకుండానే వీటిపై ప‌న్ను విధించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశం.

ఇదే స‌మ‌యంలో ఆర్‌బీఐ ద్వారా ఇదే సంవ‌త్స‌రంలో డిజిట‌ల్ క‌రెన్సీని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. రూపాయికి మ‌రింత బ‌లం చేకూర్చేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. బ్లాక్ చెయిన్ సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఆర్‌బీఐ తేనున్న డిజిట‌ల్ క‌రెన్సీతో డిజిట‌ల్ బ్యాంకింగ్ విధానం ఊపందుకుంటుంద‌ని ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. డిజిటల్ రూపీ ప్ర‌వేశంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మ‌రింత ఉత్తేజం వ‌స్తుంద‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. డిజిట్ క‌రెన్సీ రూప‌క‌ల్ప‌న‌కు సంబంధించి ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నున్న చ‌ర్య‌ల‌పై ఇంకా పూర్తి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. గ‌తంలో నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో క‌రెన్సీ లావాదేవీల‌కు సంబంధించి త‌లెత్తిన ఇబ్బందుల కార‌ణంగా సామాన్య ప్ర‌జ‌లు సైతం క్ర‌మంగా డిజిట‌ల్ లావాదేవీల‌కు అల‌వాటు ప‌డ్డారు. ఇప్పుడు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఈ దిశ‌గా దేశం మ‌రింత ముందుకు వెళ్లే అవ‌కాశం క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: