ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె ఆలోచన విరమించుకున్నారు. ప్రభుత్వ పెద్దలతో జరిపిన చర్చలు నిన్న రాత్రి ఫలవంతం అయ్యాయి. కొన్ని అంశాల్లో ప్రభుత్వం దిగివచ్చింది. మరికొన్ని అంశాల్లో ఉద్యోగ సంఘాలు రాజీపడ్డాయి. మొత్తానికి సమస్య ముగిసిపోయినట్టు ఉద్యోగు సంఘాలు, అటు ప్రభుత్వ పెద్దలు నిన్న రాత్రి ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు సమ్మె నిర్ణయం ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వంతో చర్చల సఫలంతో సమ్మె నిర్ణయం ఉపసంహరించుకున్నామని తెలిపాయి.

 
హెచ్‌ఆర్‌ఏ పెంపు, సీసీఐ కొనసాగింపుపై ప్రభుత్వం దిగిరాగా.. మరికొన్ని ఇతర డిమాండ్లను ఉద్యోగ సంఘాలు వదులుకున్నాయి. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల్లో మార్పులకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇక ఇక్కడితో కొన్నినెలలుగా ఏపీలో వార్తల్లో ఉన్న ఈ అంశం ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. ఏదో ఒక పరిష్కారం లభించింది కదా అనుకున్నారు. కానీ.. సమస్య ఇంకా ముగిసిపోలేదు.. ఉద్యోగ సంఘాల నేతల మధ్య ఈ విషయం విబేధాలు పొడచూపుతున్నాయి. ప్రత్యేకించి ఉపాధ్యాయ సంఘాల నేతల మాటలను ఉద్యోగ సంఘాల జేఏసీ పట్టించుకోలేదన్న విమర్శ వస్తోంది.


వేతన సవరణ విషయంలో ఉపాధ్యాయ సంఘాల అసంతృప్తిగా ఉన్నాయి. పీఆర్సీ సాధన సమితి వైఖరిని ఉపాధ్యాయ సంఘాలు తప్పు పడుతున్నాయి. ఉదయం 11 గంటలకు విజయవాడ లో సమావేశం కానున్న ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య.. తదుపరి కార్యాచరణపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్‌, సీపీఎస్ రద్దు, పాత క్వాంటం ఆఫ్ పెన్షన్, హెచ్ ఆర్ ఏ శ్లాబుల సాధనలో అన్యాయం జరిగిందని  ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తున్నాయి. స్టీరింగ్ కమిటీ నాయకుల వైఖరిని ఉపాధ్యాయ సంఘాలు తప్పు పడుతున్నాయి.


నిన్న సమావేశంలో తమ అభ్యంతరాలను చెప్పినా పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. చర్చలపై టీచర్స్‌ ఫెడరేషన్‌ అసంతృప్తిగా ఉంది. విజయవాడలో బ్రహ్మాండమైన ఉద్యమం చేసినా దాన్ని వినియోగించుకోవడంలో పీఆర్సీ సాధన సమితి విఫలమైందంటున్నారు  ఏపీటీఎఫ్‌ నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: