వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎల్లోమీడియాలో వరసబెట్టి నిందితులు, అనుమానితులు, సాక్ష్యుల వాంగ్మూలాలంటు పెద్ద రచ్చే జరుగుతోంది. అదేదో డైలీ సీరియల్ వచ్చినట్లు రోజుకో వాంగ్మూలాన్ని ఎల్లోమీడియా బయటపెడుతోంది. ఇందులో ఎంతవరకు నిజమో ? ఎంతవరకు అబద్ధమో అర్ధం కావటంలేదు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియాలో వస్తున్న వాంగ్మూలాల విషయంలో సీబీఐ ఏ విధంగాను స్పందించటం లేదు.





విచిత్రమేమిటంటే పులివెందుల జనాలు సీబీఐకి పోయిన సంవత్సరం ఇచ్చిన వాంగ్మూలాలు అంటు కొన్నింటిని ఎల్లోమీడియా ఇపుడు ప్రతిరోజు డైలీ సీరియల్లాగ బయటపెడుతోంది.  పులివెందులలోని మామూలు జనాలు సీబీఐని కలవటం ఏమిటో ? వాళ్ళు ఏడాది క్రితం సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ఈ మీడియాకు చిక్కటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఎందుకంటే సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం చాలా రహస్యంగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఒక్కోరిని పిలిచి సీబీఐ వాంగ్మూలాన్ని రికార్డు చేసుకుంది. వాంగ్మూలంలో వాళ్ళు ఏమి చెప్పారనే విషయం బయటకు వచ్చే అవకాశమే లేదు. చెబితే సీబీఐ అధికారికంగా చెప్పాలి. లేకపోతే వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తులే చెప్పాలి.






ఇటు సీబీఐ కానీ అటు వాంగ్మూలాలు ఇచ్చిన వారు కానీ నోరిప్పలేదు. అయినా ఈ మీడియాలో వాళ్ళ వాంగ్మూలం, వీళ్ళ వాంగ్మూలాలంటు ప్రతిరోజు కథనాలు వచ్చేస్తున్నాయి. తాజాగా వివేకా కూతురు సునీత ఇచ్చిన వాంగ్మూలమంటు ఒక కథనం అచ్చయ్యింది. సరే సునీతంటే మీడియాతో మాట్లాడిందని అనుకోవచ్చు. కానీ మిగిలిన వాళ్ళు మీడియాతో ఎక్కడా మాట్లాడలేదు. పైగా తన వాంగ్మూలం పేరుతో వచ్చిన కథనం అబద్ధమని స్వయంగా కల్లూరు గంగాధర్ రెడ్డి మండిపోతున్నాడు. సీబీఐతో తాను చెప్పని విషయాలను తాను చెప్పినట్లు రాయటం ఏమిటని నిలదీస్తున్నారు. అసత్య కథనాలపై కోర్టులో పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో పులివెందుల వాసులు వెంకటరమణ, జగదీశ్వరరెడ్డి, కల్లూరు గంగాధరరెడ్డి, వెంకట బయపురెడ్డి, నాగప్పలు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలమంటు ప్రముఖంగా అచ్చయ్యింది.





ఈ నేపధ్యంలో వీళ్ళ పేర్లతో అచ్చయిన వాంగ్మూలాల్లో నిజమెంతో అనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది. వీళ్ళందరు చెప్పిందేమంటే వివేకా హత్య సూత్రదారులు అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డే అని. ఇంకా విచిత్రం ఏమిటంటే తాము హత్య జరిగిన ఇంట్లో ఉండి చూసినట్లు వాంగ్మూలాలు ఇచ్చినట్లు అచ్చవ్వటమే. పైగా  వీళ్ళెవరు కుడా హత్య జరిగిన సమయంలో ఎంపీని, ఆయన తండ్రిని చూసినట్లు చెప్పలేదు. అయినా వీళ్ళే హత్యకు సూత్రదారులని వాంగ్మూలాలు ఇచ్చారని కథనాలు అచ్చవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి సాక్ష్యులని, పులివెందుల వాసులంటు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలతో అయోమయం పెరిగిపోతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: