మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..? అదే జరిగితే ప్రపంచ వినాశనం ఖాయమేనా..? రష్యా - ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం మూడో ముప్పుని సూచిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. అసలు రెండు దేశాల మధ్య యుద్ధం ఇంత తీవ్రతరం ఎందుకైంది. కనీసం మిగతా ప్రపంచ దేశాల చొరవతో అయినా యుద్ధం ఎందుకు ఆగిపోలేదు. పుతిన్ ఎందుకు వెనక్కి తగ్గట్లేదు?

ఒక పథకం ప్రకారం ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా ముందడుగు వేసింది. ఉక్రెయిన్‌ పై రష్యా మిలటరీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఉక్రెయిన్ తమ పోరాటం ఆపి లొంగిపోయే వరకు, రష్యా డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం కొనసాగిస్తామని ఉక్రెయిన్‌ ను ఉద్దేశించి హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అంటే యుద్ధం ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడంలేదు. అటు ఉక్రెయిన్ లొంగేది లేదని ఖరాఖండిగా చెబుతోంది. రష్యా వైమానిక దాడుల్ని చాకచక్యంగా తిప్పికొడుతోంది, బదులు తీర్చుకుంటోంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. ఉక్రెయిన్ ఇప్పటికీ తనను తాను రక్షించుకుంటోందే కానీ, శత్రు దేశంపై యుద్ధం మొదలు పెట్టలేదు. అదే మొదలైతే.. వినాశనం తప్పదు.

ఇప్పటికే రెండు దఫాలుగా శాంతి చర్చలు జరిగాయి, అవి విఫలం అయ్యాయి. మూడోసారి జరిగే శాంతి చర్చల్లో నిర్మాణాత్మక విధానాన్ని అవలంభించాలంటూ ఉక్రెయిన్ కి పుతిన్ ఉచిత సలహా ఇచ్చారు. ఈ విషయంపై  ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ పోన్ కాల్ లోనూ ఉక్రెయిన్ తీరుపై పుతిన్ తీవ్రంగా మండిపడ్డారు. రెండో దఫా చర్చల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం పౌరుల తరలింపుకోసం తాము కాల్పుల విరమణ ప్రకటించామని, కానీ ఉక్రెయిన్ పౌరులను తరలించడంతో విఫలమైందని పేర్కొన్నారు పుతిన్. విదేశీయులను బందీలుగా చేసుకునే ఉద్దేశం ఉక్రెయిన్ కు ఉందని ఆయన దుయ్యబట్టారు. ఆ దురుద్దేశంతోటే పౌరుల్ని తరలించలేదన్నారు. ఉక్రెయిన్ ఇలాగే ముందుకెళ్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు పుతిన్. మరోవైపు పుతిన్ దూకుడు చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి తారి తీస్తుందని, మిగతా దేశాలు కూడా ఇందులో పాల్గొనాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందనే అనుమానాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: