నేడు 4 గంటలకు “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” సమావేశం జరుగనుంది.  కాంగ్రెస్ పార్టీ లో కీలక నిర్ణయాలు తీసుకునే అత్యంత ఉన్నత స్థాయు సంఘం “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ”(సి.డబ్ల్యు.సి) సమావేశంలో సంస్థాగత ఎన్నికల పై నేడు చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ఈ రోజు సమావేశం అవుతున్న సి.డబ్ల్యు.సి....  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పై మరలా విమర్శలు, ప్రశ్నలు మొదలవ్వడంతో, వచ్చే సెప్టెంబరు లో  సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించనున్నారు.  సెప్టెంబర్ లో కాకుండా మరింత ముందుగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకోనుంది సి.డబ్ల్యు.సి సమావేశం.  కాంగ్రెస్ పార్టీకి పూర్తికాలం ( ఫుల్ టైమ్) పనిచేసే అధినేత ఉండాలని,  అన్ని స్థాయిల్లో ప్రక్షాళన చేయాలని,  గట్టిగా డిమాండ్ చేస్తున్నారు పార్టీ సీనియర్ అసమ్మతి నేతలు.  కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలని, నాయకత్వం మార్పు కావాలని కోరుతూ రెండేళ్ళ క్రితమే సోనియా గాంధీ కి లేఖ రాసిన  23 మంది అసమ్మతి నేతల బృందం ( జి-23).   ఆ డిమాండ్ ఇప్పటివరకు “జి-23” కే పరిమితమై ఉంది. 

అయుతే, అంతర్గతంగా పలువురు నేతలు కూడా అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నా,  బాహటంగా మాట్లాడేందుకు మాత్రం ఇష్టపడడం లేదు.   గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం పార్టీ శ్రేణుల్లో నిరాశను నింపింది.   ఈ ఓటమి తో, నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని మరోసారి చుట్టుముట్టిన విమర్శలు. “ఇంత జరిగినా ఇప్పటికీ ఏలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని” గాంధీ కుటుంబాన్ని అంతర్గతంగా విమర్శిస్తున్నా, బాహాటంగా మాట్లాడేందుకు మాత్రం జంకుతున్నారు.    అధికారంలో ఉన్న మరో ప్రధాన రాష్ట్రమైన పంజాబ్ ను “ఆమ్ ఆద్మీ పార్టీ” కి కోల్పోవడమే కాకుండా, తిరిగి అధికారంలోకి వస్తామని పార్టీ భావించిన ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇవ్వడంలో కూడా వైఫల్యం చెందడం పార్టీ శ్రేణులకు మింగుడుపడని అంశం.   ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో  ఎన్నికల ప్రచారం జరిగిన ఉత్తర్ ప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో గెలుపొందడం, గతంలో గెలిచిన ఏడు స్థానాల్లో ఐదు స్థానాలు కోల్పోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: