భారత దేశంలో వాతావరణ కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. దీనికి నిదర్శనమే తాజాగా జరిగిన సర్వే. స్విట్జర్లాండ్ కి చెందిన ఐక్యూ ఎయిర్ విడుదల చేసిన ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం భారత్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. కాలుష్యం తగ్గడం లేదు సరికదా.. రోజు రోజుకీ పెరిగిపోతోంది. భారత్ లోని నగరాలు ఏమాత్రం జనావాసానికి పనికి రావు అని ఈ నివేదిక చెబుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంలో నెంబర్ 1 స్థానంలో ఉండటం మరింత విచారకరమైన విషయం. వరుసగా నాలుగో ఏడాది, అత్యంత కాలుష్యమైన రాజధాని నగరంగా ఢిల్లీ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా గాలి నాణ్యతను పరిశీలిస్తే.. అత్యంత ప్రమాదకరంగా ఉన్న తొలి 50 నగరాల్లో 35 నగరాలు మన దేశంలోనే ఉండటం విచారకరం.

భారత్ లో అన్ని నగరాలూ ఇంతే..
2021లో భారత దేశంలోని ఏ నగరమూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించుకున్న వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోలేకపోయింది. ఈమేరకు నివేదిక పచ్చి వాస్తవాలను వెలువరించింది. భారత్ లోని 48 శాతం నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాలు కంటే 10రెట్లు ఎక్కువ కాలుష్యం ఉంది. గతేడాదితో పోల్చి చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య స్థాయి 15 శాతం పెరిగింది. ప్రపంచంలోనే తొలి 100 అత్యంత కాలుష్య నగరాల్లో 63 మనదేశంలోనే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో అత్యంత కాలుష్య రాజధానుల లిస్ట్ లో భారత్ రాజధాని ఢిల్లీ మొదటి ప్లేస్ లో ఉండగా.. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా రెండో ప్లేస్ లో ఉంది.

అత్యంత కాలుష్య నగరం కూడా మనదే..
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ టాప్ ప్లేస్ లో ఉంది. అత్యంత కాలుష్య కారక నగరాల్లో కూడా భారత్ మొదటి స్థానంలో ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కారక నగరాల లిస్ట్ లో రాజస్థాన్‌ లోని భీవాడి నగరం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఉత్తర్ ప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ రెండో స్థానంలో ఉంది. ఈ లిస్ట్ లో ఢిల్లీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక కాలుష్య కారక నగరాల లిస్ట్ తీస్తే.. తొలి 15 నగరాల్లో 10 భారత దేశంలోనే ఉండటం ఆందోళనకరమైన విషయం. కాలుష్య కారక నగరాల లిస్ట్ లో భారత్ తో పాకిస్థాన్ కూడా పోటీ పడుతోంది. పాకిస్థాన్ లోని ఫైసలాబాద్‌, బహవల్‌ పూర్‌, పెషావర్‌, లాహోర్‌ లో అత్యంత కాలుష్యం ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ఆయా నగరాల్లో జీవనం పూర్తి దుర్భంరగా ఉంటుందని సర్వే పేర్కొంది. సగటు జీవిత కాలం కూడా కాలుష్యం వల్ల తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: