ఇటీవల టీటీడీ చుట్టూ పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. అలాంటి ఆరోపణల్లో నిజం ఉందా, అబద్ధం ఉందా అంటే మాత్రం ఎవరికీ తెలియదు. అయితే టీటీడీ పేరుతో ఏమయినా ప్రచారం చేయొచ్చనుకుంటున్నారేమో.. తిరుమలపై మాత్రం నిరాధారమైన వార్తలొస్తున్నాయి. దీనిపై మరోసారి మండిపడ్డారు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

ఇంతకీ ఏంటీ వివాదం..
తిరుమలలో అన్నమయ్య నివశించిన స్థలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వీటిపై కథనాలు వెలువడ్డాయి. అయితే అదంతా కేవలం దుష్ప్రచారం అని తిప్పికొట్టారు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి. 2003లో తిరుమల మాస్టర్‌ ప్లాన్‌ లో భాగంగా కొన్ని నిర్మాణాలను తొలగించామని ఆయన చెప్పారు. తిరుమల కొండపై వరాహ స్వామి ఆలయం వెనుక మఠాలు శిథిలావస్థలో ఉన్నాయని, అందుకే వాటిని తొలగించారని చెప్పారు. అప్పట్లో ఆయా మఠాల నిర్వాహకులు అందులో ఉన్న విగ్రహాలను తమతోపాటు తీసుకెళ్లారు. తిరుమల కొండపై వరాహస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న అన్నమయ్య, ఆంజనేయస్వామి విగ్రహాలను కూడా అన్నమయ్య వంశస్థులు తమతోపాటు తీసుకెళ్లారని చెప్పారు ధర్మారెడ్డి. అంతే కాని అన్నమయ్యను ఎవరూ నిర్లక్ష్యం చేయలేదని వివరణ ఇచ్చారు.

అన్నమయ్య విషయంలో టీటీడీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు ధర్మారెడ్డి. తిరుమల ఆలయంలో ప్రతి రోజూ జరిగే సుప్రభాత సేవ, కల్యాణోత్సవం, ఏకాంత సేవల్లో అన్నమయ్య వంశీకులు పాల్గొంటున్నారని, ఆ సంప్రదాయం కొనసాగుతోందని చెప్పారు అడిషనల్ ఈవో ధర్మారెడ్డి. ప్రతి రోజూ జరిగే సహస్ర దీపాలంకరణ సేవలో  కూడా అన్నమయ్య వంశీకులే.. శ్రీవారిపై అన్నమాచార్యులు రాసిన సంకీర్తనలు ఆలపిస్తారని చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలు ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ని టీటీడీ ఏర్పాటు చేసిందని, దానికోసం ప్రతి ఏడాదీ.. 25 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.

1995నుంచి అన్నమయ్య జయంతి, వర్థంతి కార్యక్రమాలు కూడా టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ధర్మారెడ్డి తెలిపారు. తాళ్లపాకలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. ఇటీవల ఏర్పడిన కొత్త జిల్లాకు కూడా అన్నమయ్య పేరు పెట్టారని అన్నారు ధర్మారెడ్డి. ఇంత చేస్తున్నా ఇంకా తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: