వైసీపీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరి మాటా చెల్లుబాటు అవుతుంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ అంటే చెప్పలేని పరిస్థితి. విజయసాయిరెడ్డి ఢిల్లీలో కీలకంగా వ్యవహరిస్తుంటే, సజ్జల ఇక్కడి వ్యవహారాలు చూసుకునేవారు. ఇప్పుడు పార్టీ పదవుల విషయంలో జగన్, సజ్జలకు ప్రాధాన్యత పెంచి, విజయసాయిని పక్కనపెట్టారనే ప్రచారం జరుగుతోంది..? ఇందులో నిజమెంత..?
 
వైసీపీలో పార్టీ పదవుల పంపకాలు జరిగాయి. 26 జిల్లాలకు జిల్లా పార్టీ అధ్యక్షుల్ని నియమించారు. జిల్లాలకు ఇన్ చార్జి మంత్రుల్ని కూడా నియమించారు. ఆ తర్వాత 11మందికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డిని ఆ పదవినుంచి తొలగించారు. ఆయనకు ప్రస్తుతం పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను పూర్తిగా అప్పగించారు. అదే సమయంలో సజ్జలకు మాత్రం కీలక పదవి దక్కింది. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లకు కోఆర్డినేటర్ గా సజ్జల వ్యవహరిస్తారు. అంటే పార్టీ వ్యవహారాలన్నిటికీ సజ్జలే బాస్ అన్నట్టుగా ఉంది ఇక్కడ వ్యవహారం.

పార్టీ ఇన్ చార్జిలను సమన్వయ పరచుకోవడం పెద్ద పదవా లేక, పార్టీ అనుబంధ విభాగాలకు అధిపతి అనేది పెద్ద పదవా అనే చర్చ జరుగుతోంది. ఒకరకంగా సజ్జలకు కీలక పదవి దక్కిందని చెప్పాలి. అంతమాత్రాన విజయసాయి పరపతికి వచ్చిన ఢోకా ఏమీ లేదు.
వైసీపీలో జగన్ తర్వాత ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరించారు. టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ ఇటీవల పెద్దగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంలేదు. తాజాగా జరిగిన పదవుల పంపకాల్లో ఆ ముగ్గురిలో సజ్జలకు బాధ్యతలు మరింత పెరిగాయి. సజ్జల 2 జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటరే కాకుండా.. అందరు కోఆర్డినేటర్లకు ఆయన బాస్ గా వ్యవహరిస్తారు. వైవీ సుబ్బారెడ్డికి మూడు జిల్లాలు అప్పగించారు. అంటే ఇప్పుడు ఆ ముగ్గురిలో సజ్జలకు బాధ్యతలు పెరిగాయి. దీనిపై వైరి వర్గాల స్పందన మాత్రం వేరేలా ఉంది. జగన్ కి, విజయసాయికి దూరం పెరిగిందని, అందుకే ఆయనకు పదవులివ్వలేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: