ఒకపుడు సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు ఇప్పుడిప్పుడే తేలే అవకాశాలు కనిపించటంలేదు. కారణం ఏమిటంటే నిందితులు, అనుమానితులు, నిందితుల తరపు కుటుంబసభ్యులు ఒకరిపై మరొకరు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కేసుల మీద కేసులు వేసుకుంటున్నారు. ఈ కేసుల్లో కొన్నింటిని కోర్టు తీసుకోలేదు. మరికొన్నింటిని విచారణకు స్వీకరించింది.




 

మధ్యలో విచారణకు సహకరించటంలేదన్న కారణంతో సీబీఐ కూడా చేతులెత్తేసింది. ఫోరెన్సిక్ నివేదికలు ఎప్పుడొస్తాయో తెలీదుకాబట్టి అప్పటివరకు విచారణ ముందుకు సాగదని స్వయంగా సీబీఐ అధికారులే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇవన్నీ సరిపోవన్నట్లు నిందితుల్లో ఒకడైన దేవిరెడ్డి శివశంకరెడ్డి భార్య తులశమ్మ వేసిన పిటీషన్ను కోర్టు తాజా విచారణకు స్వీకరించింది. మొదటినుండి తులశమ్మ వాదన ఏమిటంటే కూతురు సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, ఆయన తమ్ముడికి వివేకా హత్యకేసులో కీలకపాత్రుందని ఆమె మొదటినుండి ఆరోపిస్తునే ఉన్నారు. 




 


వివేకాహత్యకేసులో కొందరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లే తమ ఫిర్యాదు మీద వివేకా కూతురు, అల్లుడితో పాటు ఆయన తమ్ముడిని ఎందుకని సీబీఐ విచారించటంలేదని చాలాసార్లు ప్రశ్నించారు. అయినా ఎందుకనో సీబీఐ పట్టించుకోలేదు. ఆస్తుల విషయంలో వివేకాకు ఆయన కుటుంబసభ్యులకు మధ్య పెద్ద గొడవలే జరిగినట్లు బాగా ప్రచారంలో ఉంది. రెండోభార్య పేరుమీద వివేకా ఆస్తులు రిజిస్టర్ చేసినట్లు ఆ విషయం మీదే వివేకాతో కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ కు మధ్య పెద్ద గొడవలు జరిగినట్లు ప్రచారం అందరికీ తెలిసిందే.






ప్రచారాన్ని పక్కనపెట్టేసినా కనీసం తులశమ్మ ఇచ్చిన ఫిర్యాదుపైనైనా సీబీఐ వాళ్ళని విచారించుంటే సరిపోయేది. తులశమ్మ ఎన్ని ఫిర్యాదులు చేసినా సీబీఐ పట్టించుకోకపోవటం చివరకు ఆమె కోర్టులో పిటీషన్ వేయటంతో కోర్టు విచారణకు స్వీకరించింది. ఇపుడీ కేసు విచారణ ఎప్పటికి ముగుస్తుందో ఎవరు చెప్పలేరు. కోర్టు ఆదేశాల ప్రకారమైనా సీబీఐ వివేకా కుటుంబసభ్యులను విచారించక తప్పదు. మరపుడు కేసు రెడ్డొచ్చె మొదలెట్టె అన్నట్లుగా తయారవుతుంది. ఇదంతా చూస్తుంటే వివేకా మర్డర్ మిస్టరీ అసలెప్పటికైనా విడిపోతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: