తిరుమల కొండ నిండినది. అప్పుడప్పుడూ వినిపించే వార్తే అయినా, ఈసారి మాత్రం కొండ హౌస్ ఫుల్ దాటి, మరింత ఎక్కువగా నిండింది. సడన్ గా కొండపైకి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. రెండో శనివారం, ఆదివారం కావడంతో కొండకు భక్తులు పోటెత్తారు. టెన్త్ క్లాస్ ఫలితాలు కూడా విడుదల కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొండకు వస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా తిరుమల కిటకిటలాడుతోంది.

48గంటల సమయం..
తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండాల్సిన సమయం 48 గంటలుగా ఉంది. వారం రోజుల క్రితం కూడా ఇదే సిచ్యుయేషన్ ఉంది. కొండపై భక్తులకు రూమ్స్ దొరకడం కూడా కాస్త ఇబ్బందిగా మారింది. అయితే టీటీడీ మాత్రం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. వీఐపీ దర్శనాలను రద్దు చేసి వీలైనంత మేర సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు టీటీడీ అధికారులు.

తిరుమల యాత్ర పెట్టుకున్న భక్తులు.. ఇప్పటికే టికెట్లు, రూమ్స్, అన్నీ బుక్ అయిపోతేనే ప్రయాణం పెట్టుకోవాలని సూచిస్తున్నారు. హడావిడిగా కొండకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్లాలనుకునేవారు మాత్రం వేచి చూడాలని చెబుతున్నారు. క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా.. నిరంతరాయంగా ఆహారం సరఫరా చేస్తోంది టీటీడీ. పసి పిల్లలు ఇబ్బంది పడకుండా పాలు అందిస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో.. వీకెండ్ సిఫార్సు లేఖలను పక్కనపెడుతున్నామని, ఆర్జిత సేవలు కూడా రద్దు చేశామని ప్రకటించారు అధికారులు.

రెండ్రోజుల్లో సాధారణ స్థితికి..
తిరుమల కొండపై ఉన్న రద్దీ రెండ్రోజుల్లో తగ్గిపోతుందనే అంచనాలున్నాయి. అయితే శని, ఆదివారాలు మాత్రం రద్దీ తప్పదని తేలిపోయింది. ఈరోజు ఆదివారం మరింత రద్దీ ఉండే అవకాశముంది. దీంతో అధికారులు ముందుగానే రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. కానీ హడావిడిగా ప్రయాణాలు పెట్టుకునేవారు కొండకు వస్తే మాత్రం ఇబ్బంది పడక తప్పదని రెండ్రోజుల తర్వాత ప్రశాంతంగా దర్శనం దొరుకుతుందని, రూమ్స్ కూడా అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: