ఆలూ లేదు చూలు లేదుకానీ జనసేన అధినేత మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎగిరేది జనసేన జెండానే అనంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతు జనసేన అభ్యర్ధులు ఎవరు పోటీచేస్తున్నారని కాకుండా కేవలం తనను చూసి మాత్రమే జనాలు ఆ అభ్యర్ధులకు ఓట్లేసి గెలిపించాలన్నారు. పవన్ తాజా వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయనలోని అహంకారమే కనబడుతోంది. పవన్లో ఏమిచూసి మిగిలిన 174 మంది గెలిపించాలో జనాలకు అర్ధం కావటంలేదు.






పార్టీలో తాను మాత్రమే సత్యమని మిగిలిన వారందరు మిథ్యని మాత్రమే పవన్ చెప్పదలచుకున్నట్లున్నారు. ఇందుకేనేమో పార్టీలో తాను తప్ప ఇంకెవరు కనబడకూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. పార్టీలో ఒకటి నుండి పదివరకు నేతలెవరున్నారని ఆరాతీస్తే అన్నీ స్ధానాల్లోను పవనే కనబడుతారు. ఇలాంటి అహంకారపూరిత నేతలను జనాలు భరించలేరన్న విషయాన్ని పవన్ గ్రహించలేదు. నేతలు, కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదన్న వాస్తవాన్ని కూడా పవన్ పట్టించుకున్నట్లులేదు.






గతంలో టీడీపీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీయార్ కూడా ఇలాగే వ్యవహరించారు. తన పార్టీ తరపున గడ్డిపోచను నిలబెట్టినా జనాలు ఓట్లేసి గెలుస్తారంటు బహిరంగంగానే ప్రకటించారు. సీన్ కట్ చేస్తే మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో పోటీచేస్తే స్వయంగా ఎన్టీయారే ఓడిపోయారు. పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్ధు తన బొమ్మతో ప్రచారం చేసుకుంటే గెలిచిపోతారని చెప్పిన ఎన్టీయార్ లో జనాలు అహంకారాన్నే చూశారు. అందుకనే స్వయంగా ఆయన్నే ఓడగొట్టారు. ఆయన్ను ఓడగొట్టడమే కాకుండా పార్టీని కూడా  ఓడించారు.






 కేవలం తనను చూసే అన్నీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులకు ఓట్లేసి గెలిపించాలని పవన్ అడగటంలో అమాయకత్వం కాకుండా అహంకారమే కనబడుతోంది. బహుశా పవన్ మనస్తత్వాన్ని గాజువాక, భీమవరం జనాలు ముందుగానే గ్రహించినట్లున్నారు అందుకనే ఓడగొట్టారు. ఏదేమైనా ఇలాంటి డైలాగులు సినిమాల్లో పేలుతుందేమో కానీ రాజకీయాల్లో చెల్లుబాటుకాదని పవన్ కు తెలీకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి ఓడిపోయి, పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా పవన్ కు జ్ఞానోదయం కాలేదంటే ఇక అయ్యే అవకాశాలు కూడా లేవనే అనుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: