గతంలో భద్రాచలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో వరద రాలేదు. చరిత్రను తిరగరాస్తూ ఈసారి వరద ముప్పుతో భద్రాద్రి వణికిపోయింది. భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్లు మునిగిపోయి కట్టుబట్టలతో అక్కడినుంచి దూరంగా తరలిపోయారు. దీనికి కారణం ఏంటి..? పోలవరం నిర్మాణంలో ఉండటం వల్లే భద్రాచలం మునిగిందంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. ఇప్పుడే ఇలా ఉంటే, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత భద్రాద్రి వద్ద ఎప్పుడూ కనీస స్థాయిలో నీరు నిల్వ ఉంటుందని, సడన్ గా వరదలు వస్తే పోలవరం గేట్లు ఎత్తడం ఆలస్యమైతే ఇక్కడ భద్రాద్రి పూర్తిగా మునిగిపోతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఏకంగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఏపీ మంత్రులు స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా క్లారిటీ ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికాదని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు అంబటి. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారాయన. ముంపు ఉంటుందనే అంచనాలతోనే ఏడు మండలాలను ఏపీలో కలిపారని, వారికి పునరావాసం అందించాలనే కృత నిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ఉందని చెప్పారు.

పోలవరం విలీన మండలాలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరడం సమంజసం కాదని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. భద్రాచలం ఏపీకి కావాలని అడిగితే ఇచ్చేస్తారా అని ప్రశ్నించారాయన. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ విషయంలో ముందుకు వెళ్తోందని చెప్పారు రాంబాబు. పోలవరం ఎత్తు 3 మీటర్ల మేర పెంచుతున్నారనేవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, అందులో ఏమాత్రం నిజం లేదన్నారు అంబటి రాంబాబు. పోలవరం ఎత్తుపై వివాదం మంచిది కాదని చెప్పారాయన. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, అది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని, అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కష్టసాధ్యమని చెప్పారు అంబటి. ఏపీలోనే కాదు, దేశంలోనే పోలవరం పెద్ద ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్ట్ స్పిల్ వే ద్వారా ఒకేసారి 50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయవచ్చని, ఆ సామర్థ్యం పోలవరం ప్రాజెక్ట్ కి ఉందన్నారు అంబటి. ఎత్తు పెంచుతున్నారనే వార్తల్ని ఆయన కొట్టిపారేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: