ఇది విత్తుముందా చెట్టుముందా ? అనే ప్రశ్నకు సమాధానం చెప్పటంలాంటిదే. పలానా కారణం అని చెప్పలేకపోతున్నారు కానీ మొదటినుండి కాపులు ఏకతాటిపైన నిలవటంలేదు. తమ సామాజికవర్గం మీద కాపునేతలకు మమకారం లేదా అంటే చాలానే ఉంది. కానీ అదంతా మీటింగులు పెట్టుకోవటానికి, ప్రకటనలు ఇచ్చుకోవటానికి మాత్రమే పరిమితమవుతోంది. కాపు సత్తా ఏమిటో చూపించాలి అనే సమయం వచ్చేటప్పటికి ఐకమత్యం నీరుగారిపోతోంది.





మొదటినుండి కాపులను ఈ సమస్యే వెంటాడుతోంది. బీసీల్లో మెజారిటి సెక్షన్లు ఏకతాటిపైన నిలబడుతున్నట్లు కాపుల్లో నిలబడటంలేదు. అన్నీపార్టీల్లోను కాపులున్నారు, అన్నీ పార్టీల్లోను కీలకమైన స్ధానాల్లో ఉన్నారు. కానీ అందరు కలిసి మాత్రం ఐకమత్యంగా ఉండలేకపోతున్నారు. ఇపుడింతా ఎందుకంటే ఈనెల 26వ తేదీన విశాఖపట్నంలో కాపునాడు ఆధ్వర్యంలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి రంగా-రాధా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బాలాజీ మాట్లాడారు.





కాపుల్లో ఐక్యత లేదు అనే ప్రచారం తప్పని నిరూపించటమే కాపునాడు బహిరంగసభ ముఖ్య ఉద్దేశ్యంగా చెప్పారు. కాపుల సత్తా చాటటానికే బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ బాలాజీ మరచిపోయిన విషయం ఏమిటంటే కాపుల సత్తాగురించి చాటటానికి కొత్తగా బహిరంగసభ నిర్వహించాల్సిన అవసరమే లేదు. గతంలో జరిగిన బహిరంగసభల్లో కాపుల సత్తా ఏమిటో బయటపడింది. అయితే కాపులంతా ఏకతాటిపైన ఎందుకు నిలవటంలేదన్న విషయాన్నే విశ్లేషించుకోవాలి.






సామాజికవర్గం మీద ప్రేమున్నా పదవుల దగ్గరకు వచ్చేసరికి ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ కారణంగానే కాపులకు ప్రత్యేకంగా ఒకపార్టీ ఉండాలనే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. గంటా శ్రీనివాసరావు, ఆరేటి ప్రకాష్, ఏపీ రిటైర్డ్  డీజీపీ సాంబశివరావు, తమిళనాడు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో  సమావేశాలు జరిగినా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. అచ్చంగా కాపులతోనే ఒక పార్టీ పెడితే ఎంతమంది కాపునేతలు తమ పార్టీలను వదిలి కొత్తపార్టీలో చేరుతారు ? ఆ నమ్మకం లేకే కొత్తపార్టీ ఏర్పాటు వాయిదాపడుతోంది. అది జరిగేంతవరకు కాపుల్లో ఐకమత్యం ఎండమావి లాంటిదనే అనుకోవాలి.


 




మరింత సమాచారం తెలుసుకోండి: