కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రంలాంటిది. ఈదుకొని వచ్చేవాళ్ళు ఒడ్డుకు వస్తారు. అలా రాలేని వాళ్ళు మధ్యలోనే చేతులెత్తేస్తారు. అయితే మరికొందరు ఇటు ఒడ్డుకూ రాలేక అటు మధ్యలోనే చేతులెత్తేయలేక నానా అవస్తలు పడుతుంటారు. ఇపుడు తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం మధ్యలో అవస్తలు పడుతున్నట్లుగా ఉంది. కాంగ్రెస్ అనే మహాసముద్రాన్ని  చాలా అవలీలగా ఈదేయచ్చని అనుకున్నట్లున్నారు.





కానీ సముద్రంలోకి దూకిన తర్వాతే అసలు లోతు అర్ధమవుతున్నట్లుంది. రేవంత్  గజీతగాడే అనటంలో సందేహంలేదు. కానీ దూకేటప్పుడు నీటిలోతు ఎంతుంటుందో అంచనా వేసుకోవటంలో పొరబాటు పడినట్లున్నారు. తీరా దిగిన తర్వాత లోతు తెలిసినా ఏమి చేయలేకపోతున్నారు. కష్టమైనా ఈదుకుంటు బయటకు రావాలి లేదా ముణిగిపోవాలంతే. పార్టీలో జరుగుతున్న తాజాపరిణామాలు చూస్తుంటే ఏమిచేయాలో రేవంత్ కే అర్ధమవుతున్నట్లు లేదు.





అధిష్టానం ఈమధ్యనే వేసిన రెండుకమిటిల్లో అత్యధికులు టీడీపీ నుండి వచ్చిన వలస నేతలే అన్న ఆరోపణలతో సీనియర్లు భట్టి విక్రమార్క, కోదండరెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి, మహేశ్వరరెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగరరావు లాంటి వాళ్ళు రేవంత్ కు వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటే లేవదీశారు. కమిటీల విషయాన్ని అధిష్టానంతోనే తేల్చుకుంటామని, అది తేలేంతవరకు రేవంత్ పాల్గొనే ఏ సమావేశంలోను పాల్గొనకూడదని తీర్మానించారంటే ఏమిటర్ధం ?





సీనియర్ల దెబ్బకు రేవంత్ కు చుక్కలు కనబడుతున్నాయి. దీని ఫలితంగానే కమిటీల్లో పదవులు పొందిన రేవంత్ వర్గంలో చాలామంది రాజీనామాలు చేసేశారు. ఇపుడు పార్టీ పదవుల విషయంలోనే చుక్కలు చూపుతున్న సీనియర్లతో  రేపటి ఎన్నికల్లో టికెట్ల విషయంలో రేవంత్ ఇంకెంత జాగ్రత్తగా మసలుకోవాలి ? అప్పుడు కూడా ఇప్పటిలాగే ఒంటెత్తుపోకడలకు పోతే రేవంత్ కు అందరు కలిసి సినిమా చూపించటం ఖాయం. కేసీయార్, బీజేపీ మీద పోరాటాలు చేయటం కాదు ముందు పార్టీలోని సీనియర్లతో పోరాటంచేసి గెలిస్తే అదే పదివేలు. మరి రేవంత్ అంతపని చేయగలరా ? కాంగ్రెస్ వ్యవహారాలను చక్కబెట్టడం అంటే టీడీపీలో నెట్టుకొచ్చినట్లే అనుకుంటున్నట్లున్నారు. ముందుముందు ఏమవుతుందో చూడాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: