ప్రత్యర్ధులపై ఆరోపణలు, విమర్శలు చేయచ్చు. ప్రతిపక్షాలన్నాక ముఖ్యమంత్రి, అధికారపార్టీపై ప్రతిరోజు ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతునే ఉంటాయనటంలో సందేహంలేదు. అయితే చేసే ఆరోపణలు కాస్త వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అలాకాకుండా నోటికేదొస్తే అది చేసేస్తామంటే జనాలునమ్మరు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు పరిస్ధితి ఇలాగే అయిపోయింది. కాకినాడ జిల్లాలో చంద్రబాబు మూడురోజులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఒక రోడ్డుషోలో మాట్లాడుతు రాష్ట్రంలోని రు. 2 వేల రూపాయల నోట్లన్నీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కే వెళుతున్నట్లు ఆరోపించారు.





రాష్ట్రంలో ఎక్కడైనా 2 వేల రూపాయల నోట్లు చూస్తున్నారా తమ్ముళ్ళూ అని ముందు అడిగారు. తర్వాత 2 వేల నోట్లన్నీ తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ కే వెళుతున్నాయన్నారు. తన ఆరోపణలకు ఆధారాలను మాత్రం చంద్రబాబు చెప్పలేదు. నిజానికి రు. 2 వేల రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ముద్రించటం చాలా కాలంక్రితమే మానేసింది.  వస్తున్న నోట్లను కూడా బ్యాంకులు మళ్ళీ సర్క్యలేషన్లోకి పంపటంలేదు. కస్టమర్లు ప్రత్యేకంగా రు. 2 వేల నోట్లు కావాలని అడిగితే మాత్రమే ఇస్తున్నాయి.





రు. 2 వేల నోట్ల స్ధానంలో రు. 500 నోట్లను ఎక్కువగా పంపుతున్న విషయాన్ని గతంలో కేంద్రప్రభుత్వమే ప్రకటించింది. వాస్తవం ఇలాగుంటే చంద్రబాబు మాత్రం 2 వేల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ కే వెళుతున్నాయని చెబితే జనాలు ఎలా నమ్ముతారు ? గతంలో కూడా ఇడుపుల పాయ ఫాం హౌస్ లో దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను జగన్ నేలమాళిగల్లో దాచుకున్నట్లు చంద్రబాబు అండ్ కో పదేపదే చెప్పేవారు.





నిజంగానే జగన్ పైన ఆరోపణలు చేయాలంటే సమస్యలు చాలానే ఉన్నాయి.  ఇసుక దొరకటంలేదు. రోడ్లు సరిగాలేవు,  భూకబ్జాలు పెరిగిపోతున్నాయి. ప్రజలకు రెగ్యులర్ గా ఎదురయ్యే సమస్యలను వదిలేసి పనికిమాలిన ఆరోపణలు చేస్తే జనాలు ఎలా కనెక్టవుతారు. ఏ ప్రాంతంలో అన్నా చంద్రబాబు పర్యటన పెట్టుకుంటే లోకల్ ఇష్యూస్ ను ప్రస్తావించటం ద్వారా జనాలను ఆకట్టుకోవచ్చు. ఆ విషయం వదిలేసి తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయ నేలమాళిగంటే జనాలు నవ్వుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: