కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాటలు వింటు కామెడీ సినిమా చూసినంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే తిరుపతిలో గిడుగు మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పార్టీ 100 నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని చెప్పారు. అధ్యక్షుడు మారినంత మాత్రాన పార్టీ తలరాత మారిపోతుందని అదికూడా తనతోనే సాధ్యమని రుద్రరాజు చాలా బలంగా నమ్ముతున్నట్లున్నారు. పార్టీకి ఎంతమంది అధ్యక్షులు మారినా తలరాత ఇప్పట్లో మారేది కాదన్న విషయం పాపం రుద్రరాజుకు అర్ధం కావటంలేదు.





అసలు పార్టీకి 100 సీట్లు గ్యారెంటీ అనిచెప్పటానికి చాలా ధైర్యంకావాలి. ఎందుకంటే కాంగ్రెప్ పార్టీ పరిస్ధితి ఏమిటో అందరికీ బాగా తెలుసు. ఎంతో ఉజ్వలంగా వెలిగిపోతున్న పార్టీకి రాష్ట్ర విభజన రూపంలో అధిష్టానమే ఘోరీ కట్టేసింది. మెజారిటి జనాల మనోభావాలకు విరుద్ధంగా అదికూడా అడ్డుగోలుగా సమైక్య రాష్ట్రాన్ని విభజించేసింది. రాజధానితో పాటు ఆస్తులను, కేంద్రప్రభుత్వ సంస్ధలన్నింటినీ తెలంగాణాకు అప్పగించేసింది. అప్పులను, తిప్పలను సీమాంధ్రకు అంటకట్టింది.





దాంతో మండిపోయిన జనాలు 2014 ఎన్నికల్లో పార్టీని ఘోరంగా ఓడించారు. తర్వాత 2019 ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీటయ్యింది. 2014లో పార్టీ తరపున పోటీచేసిన నేతల్లో చాలామంది  తర్వాత వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోవటంతో 2019లో పార్టీ తరపున పోటీచేయటానికి అభ్యర్ధులు కూడా దొరకలేదు. ఇంతటి దయనీయస్ధితిలో కొట్టుమిట్టాడుతున్న పార్టీకి గిడుగు రుద్రరాజు కొత్తగా అధ్యక్షుడయ్యారు. ఇలాంటి పార్టీ వచ్చేఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తుందని రుద్రరాజు చెప్పటమంటే పెద్ద జోక్ కాక మరేమిటి ?





100 సీట్లు గెలవటం కాదు కనీసం 100 నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్ధులు దొరికితే అదే చాలా ఎక్కువన్నట్లుగా ఉంది పరిస్ధితి. ఈ విషయం రుద్రరాజుకు తెలీక కాదు. ఏదో అధ్యక్షుడిగా రాష్ట్రంలో అక్కడక్కడ పర్యటిస్తున్నపుడు మీడియా వాళ్ళు ఎదురవుతారు కదా. అందుకనే నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. జనాల్లో విభజన తాలూకు మంట ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీకి ఒక్కసీటులో గెలిచేంత సీన్ కూడా ఉండదన్నది వాస్తవం. కనీసం మరో రెండు ఎన్నికల్లయినా జరగాలేమో జనాల్లో కాంగ్రెస్ అంటే మంట తగ్గటానికి.

మరింత సమాచారం తెలుసుకోండి: