టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అలిగారు. కన్నా లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకోవటంపై రాయపాటి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేశారు. కన్నా చేరికను వ్యతిరేకిస్తున్నారు. కన్నా చేరిక విషయంలో చంద్రబాబునాయుడును డైరెక్టుగా నిలదీశారు.  దాంతో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కలగజేసుకుని ఇకనుండి కన్నా విషయంలో జోక్యం చేసుకోవద్దని, బహిరంగంగా మాట్టాడవద్దని ఆదేశించారు. సీనియర్ అయిన తననే అచ్చెన్న కట్టడిచేస్తారా అంటు రాయపాటి అలిగారు.





ఇంతకీ విషయం ఏమిటంట కన్నాను చేర్చుకోవటం పార్టీలో సీనియర్లెవరికీ ఇష్టంలేదని రాయపాటి చెప్పారు.  సీనియర్లను కాదని కన్నాను  చంద్రబాబు పార్టీలోకి తీసుకుంటున్నట్లు మాజీఎంపీ మండిపోతున్నారు. కన్నాను పార్టీలో చేర్చుకోవటం వల్ల టీడీపీ జరిగే లాభం ఏమిటో తమకెవరికీ అర్ధం కావటంలేదన్నారు. మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీచేసిన కన్నాకు ఎన్ని ఓట్లొచ్చాయో చంద్రబాబుకు తెలీదా అంటు ప్రశ్నించారు.





చంద్రబాబుతో పాటు తనను కూడా వ్యక్తిగతంగా కన్నా ఎన్ని తిట్లు తిట్టారో జనాలందరికీ తెలుసన్నారు. సరే రాయపాటి బాధను పక్కనపెట్టేస్తే పార్టీలోని సీనియర్లలో ఎవరికీ కన్నా రాక ఇష్టంలేదని బయటపడింది. సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట నుండి కన్నా పోటీచేయబోతున్నారట. మరి ఈ నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలు, కార్యకర్తలు కన్నాకు సహకరిస్తారా ? పైగా కన్నా ఎక్కడ పోటీచేసినా ఓడిస్తామంటు రాయపాటి బహిరంగంగానే వార్నింగ్ ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది.





వాస్తవం ఏమిటంటే కన్నా అంటే తమ్ముళ్ళల్లో ఎవరికీ పడదని చంద్రబాబుకు కూడా తెలుసు. అలాంటి కన్నాను చంద్రబాబు పార్టీలో చేర్చుకోవటంతో తమ్ముళ్ళంతా మండిపోతున్నారు. రాయపాటి బయటపడ్డారు మిగిలిన నేతలు బయటపడలేదంతే. పరిస్ధితులు చూస్తుంటే టీడీపీలో కన్నా ఎదురీదక తప్పదనే అనిపిస్తోంది. కన్నా విషయంలో మొన్నటివరకు  బీజేపీలో జరిగిందే ఇకనుండి టీడీపీలో జరుగుతుంది. ఎందుకంటే అందరినీ కలుపుకుని వెళ్ళే అలవాటు లేదు కన్నాకు. ఏ పార్టీలో ఉన్నా తనదే పై చేయి కావాలని, తన వర్గానికే లబ్ది జరగాలనే మనస్తత్వం వల్లే మిగిలిన నేతలతో గొడవలయ్యేవి. మరి టీడీపీలో ఎలా నెట్టుకొస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: