వివేకానందరెడ్డి హత్యకేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే కడప ఎంపీగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ అభిషేక్ రెడ్డి పోటీచేసే అవకాశాలున్నాయి. వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఎలాగైనా అరెస్టుచేయాలని సీబీఐ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇపుడు అరెస్టుచేయటం పెద్ద సమస్య కాకపోయినా రేపటి ఎన్నికల్లోగా పరిస్ధితులు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. వచ్చేఎన్నికల్లోగా హత్యకేసు ఆరోపణలనుండి అవినాష్ బయటపడకపోతే జగన్మోహన్ రెడ్డి కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపటం ఖాయమని తేలిపోయింది.





అవినాష్ సక్సెస్సర్ గా వైఎస్ అనీల్ రెడ్డా ? లేకపోతే అభిషేక్ రెడ్డా అనే చర్చలు  జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే బుధవారం నియోజకవర్గం పర్యటనలో అవినాష్ తో పాటు అభిషేక్ కూడా పాల్గొనటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇప్పటికే అభిషేక్ పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల మండలాలకు ఇన్చార్జిగా ఉన్నారు. వైజాగ్ లో డాక్టర్ గా పనిచేస్తున్న అభిషేక్ ను జగన్ పిలిచి పార్టీ బాధ్యతలను అప్పగించారు. డాక్టర్ కూడా పై మండలాల్లో రెగ్యులర్ గా పర్యటిస్తున్నారు.





ఈ నేపధ్యంలోనే బుధవారం ఎంపీతో కలిసి డాక్టర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంపీతో కలిసి పర్యటించటం, మీడియాతో మాట్లాడటం డాక్టర్ కు మొదటిసారి. పార్టీ కార్యక్రమాల్లో ఎంపీతో కలిసి పాల్గొనటమే కాకుండా మీడియాతో కూడా మాట్లాడించారంటే జనాలకు కాబోయే ఎంపీ అభ్యర్ధిగా పరిచయం చేస్తున్నట్లే అనుకోవాలి. వివేకా కేసులో నుండి బయటపడితే మళ్ళీ అవినాషే పోటీచేస్తారనటంలో సందేహంలేదు.





ఒకవేళ వచ్చేఎన్నికలనాటికి హత్యకేసులో క్లీన్ చిట్ రాకపోయినా అరెస్టులో ఉన్నా అవినాష్ కు ప్రత్యామ్నాయం చూసుకోక  తప్పదు. జగన్ ఇపుడా పనిలోనే ఉన్నారు. ఇటు అభిషేక్ అటు అనీల్ ఇద్దరు కూడా జగన్ కు కజిన్లే అవుతారు. ఇద్దరూ జగన్ కు బాగా సన్నిహితులే. అందుకనే ఇద్దరిలో ఒకళ్ళు ఎంపీగా పోటీచేసే అవకాశముందనే ప్రచారం బాగా జరుగుతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే స్వయంగా అవినాషే డాక్టర్ ను తనతో పాటు కార్యక్రమాల్లో తిప్పటం, మీడియా ముందుకు తీసుకురావటంతో కాబోయే ఎంపీ అభ్యర్ధి అభిషేక్ రెడ్డే అనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. మరి జగన్ ఏమిచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: