
భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరీ విముక్తి కోసం... సాగించిన మహత్తర వీర తెలంగాణ సాయుధ పోరాటం. ప్రజల గుండెల్లో ఎప్పటికి ఉద్యమ స్ఫూర్తిని, పోరాట దీప్తిని రగిలిస్తూనే ఉంటుంది. నిజాం నవాబు నిరంకుశత్వం, భూస్వాముల దౌర్జన్యం, దొరల దాష్టీకానికి ఎదురు తిరిగి.. సాయుధ పోరాటాన్ని సాగించిన.. నాటి త్యాగధనుల చరిత అజరామరం. 'పోరాడితే పోయేదేమీలేదు బానిస సంకెళ్లు తప్ప'... అనే నినాదాన్ని స్మరించుకుంటూ.. అక్షరజ్ఞానం లేని సామాన్యులు సైతం అలనాడు బందూకుపట్టి సింహాలై గర్జించారు. నిజాం నవాబు పైజామూడ గొట్టి పరుగులు పెట్టించారు. దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందారు. ప్రపంచ పోరాటాల చరిత్రలో సాటిలేని తెలంగాణ సాయుధ పోరాటంపై స్పెషల్ స్టోరీ :....
ఓవైపు యావత్ భారత్ దేశం పరాయి పాలన నుంచి విముక్తి పొంది.. సంబరాలు చేసుకుంటే, తెలంగాణ పల్లెలు మాత్రం నిజాం నిరంకుశ పాలనలో వణికిపోయాయి. ఎక్కడ చూసినా దురంతాల నిజాం పిశాచపు దుర్మార్గాలు... రజాకార్ల అరాచకం...అత్యాచారాలతో అల్లాడిపోయింది హైదరాబాద్ సంస్థానం. తెలంగాణలో రజాకార్లు సాగించిన మారణహోమంలో ఎందరో అమాయకులు బలయ్యారు. పల్లెలన్నీ ఏకమై నిజాంపై సమరశంఖం పూరించి మహాయుద్ధం చేశారు. నిజాం పీచమణిచి విజయం సాధించారు.
తెలంగాణలో ఏ పల్లెకెల్లినా ఆ పల్లెకో చరిత్ర ఉంటుంది. ఇక్కడ బండరాయిని కదిపినా గత అనుభవాలను కథలు కథలుగా చెప్తుంది. తెలంగాణ సాయుధ పోరాటం మొండ్రాయిలో మొదలై ధర్మాపురం, కామారెడ్డి గూడెం, కడవెండి, విస్నూరు, పాలకుర్తి, జనగామ, చీటకొండూరు, మద్దూరు, బైరాన్‌పల్లి, ఆకునూరు, పరకాల, మహబూబాబాద్, డోర్నకల్ వంటి ప్రాంతాలకు పాకింది. నల్లగొండ, కరీంనగర్ పల్లెల్లో ప్రజలు నిప్పుకణికలై కదిలారు. నిజాం సేనలకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. దేశ్ ముఖ్‌లను తరిమికొట్టారు.
భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం.. ప్రపంచ పోరాటాల చరిత్రలో సాటిలేని పోరాటం.. తెలంగాణ సాయుధ పోరాటం. నిజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమంలో.. విప్లవకారులకు ఆయువుపట్టుగా నిలిచాయి తెలంగాణ పల్లెలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నేల పోరాటాలకు కన్నతల్లి, ఈ నేలకు స్వార్థం లేదు. ఇక్కడి మనుషులకు స్వార్థం తెలియదు పోరాటం తప్ప. విప్లవాలకు పురిటిగడ్డ.. వీర తెలంగాణ.. తన అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటాలు సాగించిన పోరుగడ్డ తెలంగాణ. వెట్టి చాకిరి, భూస్వామ్య పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు సాగించిన పోరాటం చరిత్రలో అజరామరం. తమ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్న ప్రజలకు, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఎన్నో దేశాలకు దారి చూపింది తెలంగాణ సాయుధ పోరాటం. వడిశెలను తుపాకులుగా చేసి, రాళ్లను గుళ్లుగా మార్చి నిజాం సేనలను, దేశ్‌ముఖ్‌లను, భూస్వామ్య గుండాలను పొలిమరల దాకా ఉరికించిందీ గడ్డ. కమ్యూనిజం, మార్కిజం, లెనినిజం. ఏ ఇజం తెలియని నిరక్షరాస్యులు నడిపిన తెలంగాణ సాయుధ పోరాటం.
1947 ఆగస్టు 15.. భారతదేశంలో వలస దోపిడీదారుల పాలనకు చరమగీతం పాడిన రోజు, భారత జాతి స్వేచ్ఛ ఆలపించిన దినం. స్వాతంత్య్రం వచ్చిందని దేశ ప్రజలంతా మురిసి పోతున్నారు. ఎక్కడ చూసినా జాతీయ పతాకాలు రెపపలాడుతున్నాయి. వందేమాతరం గీతాలు ఆలపిస్తున్నారు. కానీ రాక్షస రూపంలో ఉన్నరాజు నిజాం.. నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజానీకం నలిగిపోతున్నారు. నిజాం నవాబు, ఖాసిం రజ్వీ, మతోన్మాద రజాకార్లు, దొర భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, లాంపెన్ గ్యాంగులు ఏకమై తెలంగాణలో మారణహోమం సృష్టించారు. అయ్యా, నీ బాంచన్ దొర అంటూ కాల్మొక్తా బాంచన్ అంటూ అణగిమనిగి వుండే ప్రజలను నిజాం నవాబులు తమ పాలనలో అణిచివేశారు. గ్రామాలపై విచక్షణారహితంగా దాడులు జరిపారు. స్త్రీల మాన, ప్రాణాలను దోచారు. తమకు అడ్డొచ్చిన వారిని హింసించి, కనిపించిన వారినల్లా దారుణంగా కాల్చిచంపారు. తమ మాట వినని గ్రామాలకు గ్రామాలకే నిప్పంటించి తగుల బెట్టారు. నిజాం ప్రభుత్వ దాడులకు, రజాకార్ల దుర్మార్గాలకు ఎదురు లేకుండా పోయింది.
నిజాం మిలటరీ, పోలీసు రజాకార్లు, దొరలు, దేశ్‌ముఖ్‌లంతా కలిసి రెండు లక్షలకు పైగా ఉన్నారు. వారికి అత్యాధునికమైన ఆయుధాలు, ఫిరంగులు, అశ్వికదళాలు, వాహనాలు ఉన్నాయి. వాటితో ప్రజలపై దాడులకు తెగబడే వారు. తమకు ఎదురులేదని విర్రవీగేవారు. ఎవరైనా ఎదురస్తే అంతమొందించేవారు. ఇదే క్రమంలో దొరలు, జమీందార్ల దోపిడీ, వెట్టిచాకిరిల విముక్తి కోసం, దున్నేవాడికి భూమి అన్న నినాదంతో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీల చైతన్యంతో అశేష ప్రజానీకం చీమలదండులా కదిలారు. స్త్రీలు, పురుషులు, యువతీ యువకులు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వడిసెలు, రోకలి బండలు, కారంపొడి, కత్తులు, చాకులు, బందూక్‌లు చేతబట్టి దొరలు, భూస్వామ్య అల్లరి మూకలను తరిమి తరిమి కొట్టారు. వేసిన అడుగు వెనక్కి వేయకుండా గుండె ధైర్యంతో నీటి ప్రవాహంలా ముందుకు నడుస్తూ అడుగడుగునా రక్తాన్ని ధారపోశారు. ప్రజాయుద్ధంలో నేలరాలిన వేలాదిమంది రత్నాలు, ఒక్కొక్క వీరుడు చరిత్ర సృష్టించారు. పల్లెలన్నీ విప్లవ కేంద్రాలుగా మారాయి. గ్రామాలను విముక్తి పథంలో నడిపిస్తూ గ్రామ రాజ్య కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. వెట్టిచాకిరి నిర్మూలనతో దొర, భూస్వాముల, పెత్తందార్ల దోపిడీ అంతమైంది. తెలంగాణంతటా గెరిల్లా దళాలు ప్రజల నుంచి పుట్టుకొచ్చి 90 లక్షల ప్రజానీకానికి అండగా నిలిచి సాయుధ పోరులో సమరభేరి మోగించారు.
మూడు సంవత్సరాల పాటు నిజాం దోపిడీ పాలనకు వ్యతిరేకంగా హోరాహోరీగా సాయుధ సంగ్రామం జరిగింది. ‘బాంచన్ దొర’ అన్నవారే బందూకులు చేతబట్టి పోరాట స్ఫూర్తిని రగిలించారు. అమరవీరుల రక్త తర్పణంతో నల్లటి నేల ఎరుపెక్కింది. తెలంగాణ ఎర్రబారింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేలమంది అమరులైనారు. విప్లవవీరుల రక్తంతో ఎరుపెక్కిన తెలంగాణ విప్లవ పోరాటానికి మొదటి ఆంధ్ర మహాసభ ప్రేరణ కలిగించింది. రాత్రిపూట ఊరేగింపుల్లో కదం తొక్కుతూ, పదం పాడుతూ ప్రజల్ని ప్రభావితం చేశారు. విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మ దొరసాని కడవెండిలో ఉంటుంది. మహిళ అయినప్పటికీ ప్రజల పట్ల క్రూరత్వంతో ఉండేది. వెట్టిచాకిరి చేయించడంలో దిట్ట, వడ్డీ నాగులు వసూలు చేయడంలో, రకరకాల శిక్షలు వేసి జరిమానాలు విధించడంలో పరమ శాడిస్టు. ఆమెను చూసి జనమంత వణికేవారు. ఆరుట్ల రామచంద్రా రెడ్డి కడవెండి కెళ్ళి ఆంధ్రమహాసభ సందేశాన్ని వినిపించాడు. దీంతో గ్రామ రాజ్యకమిటీ ఏర్పడింది. యువకులంతా సంఘంలో చేరిపోయారు. విసునూర్ దేశ్‌ముఖ్‌లు, రౌడీలు కడవెండి గ్రామంపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలోనే దొడ్డి కొమురయ్య తీవ్రంగా గాయపడి, మరుసటి రోజు వీర మరణం పొందాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య ‘తొలి విప్లవకారుడు’గా అమరుడైనాడు.