ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కొత్త కొత్త ఆలోచనలు పురుడు పోసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనం మెప్పు పొందేందుకు వీలుగా కూటములు కూడా తయారు అవుతున్నాయి. ఎన్నికల్లో గెలవడమే ప్రధానంగా సిధ్ధాంతలు పక్కన పెట్టి రాజకీయ పార్టీలు భుజం కలిపేందుకు సిధ్ధపడుతున్నాయి.


పావులు కదుపుతున్నారు :


డిల్లీ టూరుకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అక్కడ జాతీయ రాజకీయాలతో పాటు, ఏపీలో భవిష్యత్తు కూటములపైనా భారీ కసరత్తే చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చాలాకాలం తరువాత సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డితో భేటీ కావడం విశేష పరిణామమే. ఏపీలో వాపపక్షాలు టీడీపీపై కత్తులు దూస్తున్నాయి.  బాబు పేరు చెబితేనే కస్సుమంటున్నాయి. మోడీ, బాబు పాలన పోవాలంటూ ఏపీలో సీపీఐ రామక్రిష్ణ నాయకత్వంలో పోరాటాలు కూడా చేస్తున్నారు. ఈ సమయంలో బాబుతో సీపీఐ పెద్ద నాయకుడే భేటీ కావడాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.


బీజేపీ బూచిగా :


బీజేపీ, మోడీ అంటే వాపక్షాలకు ఎంతో చిరాకు. దేశంలో కాషాయదళంతో కమ్యూనిస్టులకు సిధ్ధాంతపరమైన వ్యతిరేకత. తీరని ద్వేషం. దానినే బూచిగా  చూపించి బాబు అటునుంచి నరుక్కు వస్తున్నారు. తాను మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్తున్న బాబు ఆ శిబిరంలోకి సీపీఐని ఆహ్వానించడం ద్వారా ఏపీలో చెలిమికి కొత్త బాటలు వేస్తున్నారు. నిజానికి తెలంగాణాలో ఇప్పటికే మహా కూటమి పేరు మీద టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ జట్టు కట్టాయి. దానికి ఏపీకి విస్తరించడమే ఇపుడు బాబు పని


ఇక్కడా కూటమి :


అదే జరిగితే ఏపీలోనూ కాంగ్రెస్, టీడీపీ, వాపక్షాలతో వచ్చే ఎన్నికల ముందే ఓ కూటమి వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఇపుడు వామపక్షాలు జనసేనాని పవన్ కళ్యాన్ వైపు చూస్తున్నాయి.  తాము మూడవ కూటమి పెడతామని కూడా అంటున్నాయి. అయితే పవన్ దశ, దిశా  వారికి అర్ధం కావడం లేదు. పైగా పవన్ వారిని సంప్రదించకుండా సొంతంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. మరి దీనిపై గుర్రుగా ఉన్న కామ్రేడ్స్ బాబు తో చివరి నిముషంలోనైనా  చేతులు కలిపే అవకాశాలు లేకపోలేదు.


ఇలా ఉండొచ్చేమో :


రేపటి ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఇలా ఉండొచ్చు. బాబు, కామ్రెడ్స్, కాంగ్రెస్ కూటమి ఓ వైపు, జగన్ వైసీపీ, జనసేన మరో వైపు, బీజేపీ ఒంటరి గా ఇంకోవైపు ఏపీలో పోరు జరిపే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక మరింతగా ముందుకెళ్తే బీజేపీ కూడా జగన్ కూటమిలో కలిసే అవకాశాలూ కొట్టిపారేయలేం. మొత్తం మీద చూసుకుంటే 2014 నాటికి భిన్నమైన రాజకీయ మోహరింపు రేపటి ఎన్నికల్లో కనిపించడం ఖాయంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: