మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్ధితి ఇలాగైపోయిందేంటో అర్ధం కావటం లేదు. మూడు రాజధానుల వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించగానే తెలుగుదేశంపార్టీలో ఎంతటి గందరగోళం మొదలైందో అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలోనే విశాఖపట్నంలో ప్రత్యేకంగా పార్టీ సమావేశం ఏర్పాటు చేసిన గంటా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయటాన్ని స్వాగతించాడు. గంటా స్వాగతించటమే కాకుండా మరికొందరు సీనియర్ నేతలతో జగన్ ప్రతిపాదనకు జై కూడా కొట్టించాడు.

 

గంటా చేసిన పని అప్పట్లో పార్టీలో  ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.  గంటా ప్రకటన చేశాడో లేదో వెంటనే చంద్రబాబుపైన కూడా విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. అంటే జగన్ ప్రతిపాదనకు గంటా బహిరంగ మద్దతు పలికినట్లే అనుకోవాలి. అతంటి మద్దతు ప్రకటించిన గంటాపై ఏమాత్రం కనికరం చూపకుండానే జగన్ గట్టి దెబ్బ కొట్టినట్లే అనుకుంటున్నారు. ఎలాగంటే గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం కార్యకర్తలను భారీ ఎత్తున వైసిపిలో చేర్చుకున్నాడు.

 

నియోజకవర్టంలోని నేతలు, కార్యకర్తలు  సుమారు  500 మంది వైసిపిలో చేరటం నగరంలో కలకలం సృష్టించింది. ఆమధ్య బిజెపికి చెందిన నేతలు, కార్యకర్తలు సుమారు 300 మందిని సైలెంట్ గా గంటా పార్టీలో చేర్చుకుని కమలంపార్టీని దెబ్బకొట్టారు. మరిపుడు 500 మంది టిడిపి నుండి అధికారపార్టీలో చేరటాన్ని గంటా ఎలా తట్టుకుంటారో ఏమో .

 

సరిగ్గా స్ధానిక ఎన్నికలకు ముందు వందలమంది కార్యకర్తలు పార్టీని వీడటమంటే మామూలు విషయం కాదు.  పైగా విశాఖపట్నం నగరమంటే మున్సిపాల్ కార్పొరేషన్  క్రిందకే వస్తుంది.  తాజాగా తగిలిన దెబ్బ  గంటాను కచ్చితంగా ఇబ్బందులు పెట్టేదే. మరి పార్టీ నుండి వలసలు ఒక్క ఉత్తరం నియోజకవర్గంలో మాత్రమేనా లేకపోతే మొత్తం నాలుగు నియోజకవర్గాల్లోను జరుగుతుందా అనే టెన్షన్ పెరిగిపోతోంది. మరి తాజాగా తగిలిన దెబ్బను పాపం  గంటా ఎలా తట్టుకుంటాడో ఏమో అని పార్టీ నేతలే సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: