పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో జరిగే ఈ ప్రత్యేక వేడుకను.. అంగరంగవైభవంగా జరుపుకోవాలని ఎవరికుండదు చెప్పండి? కానీ ఇప్పుడా స్పెషల్‌ ఈవెంట్‌ పైనా కరోనా ఎఫెక్ట్‌ పడింది. వైభవంగా పెళ్లి చేసుకుంటే కటకటాల పాలయ్యే పరిస్థితి దాపురించింది. కరోనా దెబ్బకు పెళ్లి సందడి  చప్పున చల్లారిపోతుంది. 

 

డబ్బులున్నాయి కదా అని... భూమంత అరుగేసి, ఆకాశమంత పందిరేసి .. కోట్ల ఖర్చుతో అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పుడస్సలు కుదరదు. అతిథుల సంఖ్య రెండొందలకు మించిందంటే.. మీతో పాటు, మీకు ఫంక్షన్‌హాల్‌ రెంటుకిచ్చిన వారికీ.. ఫైన్‌ తప్పదు. అవును.. తెలంగాణలో కరోనా వైరస్‌ పుణ్యమా అని ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. నడుస్తోంది. సీఎం ఆదేశాలతో మ్యారేజీ హాల్స్‌ మీద ఓ కన్నేసి ఉంచిన పోలీసులు.. కొరడా ఝళిపిస్తున్నారు. 

 

సీఎం చెప్పినా.. ఎవరు చెప్పినా.. మేం చేసేది చేస్తాం అనే వాళ్లకు పోలీసులు గట్టి షాకే ఇస్తున్నారు. భారీగా ఫైన్‌ వేసి.. మంటపాలకు తాళాలు వేసేస్తున్నారు. నిర్మల్ పట్టణ పోలీసులు .. ఈ విధంగా మూడు మ్యారేజి హాల్స్ ను లాక్‌ చేసేశారు. హాల్‌ రెంటుకిచ్చిన వ్యక్తి A1 కాగా... నవవధువు తండ్రి A2గా కేసు పెట్టారు. అదే విధంగా సాగర్ కన్వెన్షన్ అనే మరో హాల్ పైనా పోలీసులు కేసు బుక్‌ చేశారు. ఖానాపూర్ లోని AMK ఫంక్షన్ హాల్ ను సీజ్ చేశారు. 

 

పెళ్లి మాత్రమే కాదు.. 200కు మించి అతిథులుండే ప్రతి శుభకార్యంపైనా కేసు గ్యారెంటీ అంటున్నారు పోలీసులు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్‌ 51 కింద కేసులు నమోదు చేస్తున్నారు. మొత్తానికి కరోనా రక్కసి దేశంలో మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఏ పని తలపెట్టినా కరోనా భూతం తెగ భయపెట్టేస్తోంది. శుభమా అని.. పెళ్లి కార్యాలు, రిసెప్షన్లు జరుపుకుందాం అన్నా కరోనా తెగ భయపెట్టేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: