రాజకీయ నాయకులన్నాక స్వార్థం ఉంటుంది. ఉండాలి కూడా. అది లేకపోతే.. తనను నమ్మి ఓట్లేసిన వారికి న్యాయం చేయలేరు. అయితే ముఖ్యమంత్రి వంటి స్థాయికి వెళ్లాక ఇక సొంత ప్రాంతం అంటూ ఏమీ ఉండదు. రాష్ట్రమంతా సొంత ప్రాంతమే. అయినా సరే. తన సొంత నియోజక వర్గంపై ఏదో ఒక మూల ప్రత్యేక ఆదరణ ఉంటుంది. సీఎం జగన్ కూడా అంతే.

 

 

అందుకే ఆయన పులివెందులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. తాజాగా పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరి సొంత నియోజక వర్గానికి జగన్ ఏం వరాలు కురిపించాడో చూద్దాం.. పులివెందుల మెడికల్‌ కాలేజీ శంకుస్థాపన, పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఆగస్టు కల్లా టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి త్వరితగతిన పూర్తిచేసి ఈ సంవత్సరంలోగా మెడికల్‌ కాలేజీ పనులు ప్రారంభించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

 

 

పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్కూల్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, అరటి రీసెర్చ్‌ సెంటర్‌లో ట్రైనింగ్‌ వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇక జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ – చక్రాయపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. ఈ నెలాఖరుకల్లా జ్యుడిషియల్‌ ప్రివ్యూ పూర్తిచేసి టెండర్ల ప్రక్రియకు సిద్ధం కావాలని ఆదేశించారు. వేంపల్లి మండలంలోని అలవలపాడు, పెండ్లూరు చెరువు, జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి పీబీసీ కెనాల్‌కు రూ.46.5 కోట్లతో లిఫ్ట్‌ స్కీమ్‌కు పాలనాపరమైన అనుమతుల మంజూరుకు సీఎం ఆదేశించారు.

 

 

పులివెందులలో అరటి స్టోరేజీ, ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అనంతపురం, కడప వంటి అరటి సాగు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు సిద్ధం చేయాలన్నారు. దేవుని కడప చెరువు సుందరీకరణ, రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులకు నిధుల విడుదలకు ఆదేశించారు. రిమ్స్‌ ఆస్పత్రి అభివృద్ధిలో భాగంగా డాక్టర్‌ వైయస్‌ఆర్‌ కేన్సర్‌ ఆస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్, సైకియాట్రీ ఆస్పత్రులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: