దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఐదో విడత లాక్ డౌన్ సడలింపుల అనంతరం దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దాదాపు 10,000 కేసులు నమోదయ్యాయంటే దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. జూన్ 15 నుంచి ప్రతిరోజూ 15,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఇతర రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసినా వైరస్ ను నియంత్రించడం సాధ్యం కావడం లేదు. ఈ నెల 8వ తేదీ నుంచి మరిన్ని సడలింపులు అమలులోకి రానుండడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఆస్పత్రుల్లో, సెక్రటేరియట్ లో, ప్రభుత్వ కీలక శాఖల్లో కేసులు నమోదవుతూ ఉండటం... పల్లెలకు కూడా వైరస్ పాకుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో భారత్ లో 198 రకాలుగా వైరస్ వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. ఊసరవెల్లిలా కరోనా వైరస్ రూపాన్ని మార్చుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
కరోనా వైరస్ చిన్నగా ఉంటుందని... లక్ష కరోనా వైరస్ లను కలిపితే ఒక నీటిచుక్క అంత ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ 198 రకాలు అంటే వైరస్ లో పెద్దగా మార్పులు ఉండవని... చిన్నచిన్న మార్పుల వల్లే వాటిని వేరువేరు రకాలుగా గుర్తిస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా, యూరప్ దేశాలలో విజృంభించిన వైరస్ రూపాంతరం చెంది భారత్ లో విజృంభించిందని... ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్ ఎక్కువగా రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: