ఇక్కడ ఓ దారుణ ఘటన జరిగింది... అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి ఒంటరిగా కనిపించడంతో స్థానికులు అతన్ని దొంగ అని అనుకున్నారు. దీంతో వెనక ముందూ చూడకుండా ఏకంగా అతన్ని పట్టుకుని దారుణంగా చితకబాదారు. ఇక వారి దెబ్బలతో తీవ్ర గాయాలపాలైన సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగ అనే అనుమానంతో ఓ వ్యక్తి చితకబాది చివరికి ప్రాణాలు తీశారు.




 బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ప్రగతి నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న అభి  వెంచర్ లో  పనిచేయడానికి కొంత మంది మేస్త్రీల బృందం ఇటీవలే ఒడిషా నుండి అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలోనే తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అక్కడ పని చేయడానికి వచ్చిన లక్ష్మన్ అనే మేస్త్రి... అభి వెంచర్ కు ఆనుకుని ఉన్న మరో నూతన అపార్ట్ మెంట్ లో కి వెళ్ళాడు. అలికిడి   రావడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ అతనిని గమనించాడు.




 దీంతో దొంగ అపార్ట్మెంట్ లోకి చొరబడుతున్నాడు అని వాచ్ మెన్ నర్సింహులు భావించాడు. దీంతో  వెంటనే కర్రతో  మేస్త్రి లక్ష్మణ్ తలపై గట్టిగా బాదాడు. అటు వెంటనే చుట్టుపక్కల వారు అందరికీ ఈ సమాచారాన్ని అందించాడు వాచ్ మెన్ . దీంతో అక్కడికి చేరుకున్న చుట్టుపక్కలవారు మేస్త్రీ లక్ష్మణ్ ను  తీవ్రంగా చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలపాలైన లక్ష్మణ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. ఇక అతని పరిస్థితి విషమించింది అని గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కాని మార్గమధ్యంలోనే లక్ష్మణ్ మృతి చెందడం గమనార్హం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాచ్మెన్ నరసింహులు ని  అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: