సీఎం కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష త్వరలోనే ఓ ఇంటి కోడలు కాబోతోంది. ఐదేళ్లలో ఆరోగ్యపరంగా ఆమె బాగా మెరుగైంది. విద్యలోనూ రాణించింది. తనకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది ప్రత్యూష. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ప్రత్యూష- చరణ్‌ రెడ్డి నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది.

కన్న తండ్రి, పినతల్లి చేతిలో చిత్రహింసలకు గురై దాదాపు చావు అంచులదాక వెళ్లి.. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ప్రత్యూష  మామూలు మనిషిగా మారింది. యువతి కోలుకున్నాక స్వయంగా ప్రగతిభవన్‌కు పిలిపించుకొని తనతో కలిసి భోజనం చేసే అవకాశాన్ని  కల్పించడమే కాదు.. ఆమెను దత్తత కూడా తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. ఇలా సీఎం దత్తపుత్రికగా మారి ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్న ఆమె ఇప్పుడు ఓ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతోంది.  

పినతల్లి చిత్రహింసల నుండి బయటపడ్డ తర్వాత ప్రత్యూష యోగక్షేమాలను మహిళా శిశు సంక్షేమ అధికారులు చూసుకుంటున్నారు. సీఎం ఆదేశాలతో ఐఏఎస్ అధికారి రఘునందన రావు ప్రత్యేకంగా ప్రత్యూష యోగక్షేమాలను చూస్తున్నారు. ప్రస్తుతం నర్సింగ్ ను పూర్తిచేసిన ప్రత్యూష ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్‌గా పనిచేస్తూ తన కాళ్లపై తాను నిలబడింది.

హైదరాబాద్‌కు చెందిన చరణ్‌రెడ్డి రాంనగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటారు. చరణ్ రెడ్డి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ప్రత్యూషను కలిసి విషయం చెప్పాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. ఆ తరువాత విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆమెను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు సీఎం కేసీఆర్‌. వరుడి పూర్తి వివరాలను తెలుసుకొని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. నిశ్చితార్థం దగ్గరుండి జరిపించాలని అధికారులను ఆదేశించారు సీఎం. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిరాడంబరంగా నిశ్చితార్థ వేడుకలు నిర్వహించారు.

తనకు నచ్చిన వ్యక్తితో ప్రత్యూష కొత్త జీవితాన్ని పంచుకోబోతోంది. పెళ్లికి స్వయంగా వస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని ప్రత్యూష తెలిపింది. సీఎం కేసీఆర్ అండతోనే తాను కోలుకున్నానని, మంచి కుటుంబంలోకి వెళుతున్నందుకు ఆనందంగా ఉందని అంటోంది ప్రత్యూష.


మరింత సమాచారం తెలుసుకోండి: