ఐదు సంవత్సరాల్లో ఎవరికైనా ఎంత వయసు పెరుగుతుంది. అదేంటి? ఐదేళ్లే కదా! అంటారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే బిహార్ డిప్యూటీ సీఎం తార్‌కిషోర్ ప్రసాద్ వయసు గడిచిన ఐదేళ్ల కాలంలో రెట్టింపు స్థాయిలో పెరిగింది. అర్థం కాలేదా? అదేనండీ ఐదేళ్లలో ఎవరికైనా ఐదేళ్ల వయసే పెరగాలి. కానీ మన నేతకు మాత్రం 12 ఏళ్లు పెరిగిందన్నమాట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమేనండీ బాబూ. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అతను దాఖలు చేసిన అఫిడవిట్‌ చూస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది.

కటిహార్ నుంచి తార్‌కిషోర్ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2010 ఎలక్షన్లలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం, ఆయన వయసు 49 ఏళ్లు. అది 2015 ఎన్నికల్లో 52గా మారింది. మరో ఐదేళ్ల తర్వాత, అంటే మొన్న జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వయసు 64 ఏళ్లుగా తార్‌కిషోర్ ప్రసాద్ అఫిడవిట్‌లో ఉంది. ఈ విధంగా చూస్తే 2015 నుంచి 2020 మధ్య తార్‌కిషోర్ ప్రసాద్ వయసు 12 ఏళ్లు పెరిగిందన్నమాట. దీనిపై స్పందించిన తార్‌కిషోర్ ప్రసాద్... తన వయసు విషయంలో రాద్దాంతం అనవసరం అని చెప్పారు.

వయసు విషయంతో తానెప్పుడూ అబద్ధాలు చెప్పలేదని అన్నారు. తాను 1956 జనవరి 5న జన్మించానని, ఆ లెక్కన తన వయసు 64 ఏళ్లని వివరించారు. 2015 ఎన్నికల సమయంలో కూడా ఇదే విషయం రాశానని, అఫిడవిట్‌లో వయసు 59 అనే రాశానని తేల్చి చెప్పారు. కానీ దాన్ని 52 అని రాసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల నాటికి తన వయసు 64 ఏళ్లని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా. ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించారు. వీరిలో తారకిషోర్ కూడా ఒకరు.

మరింత సమాచారం తెలుసుకోండి: