చాలా రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి బిజెపిలో చేరబోతున్నారు అంటూ అదేపనిగా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల యుద్ధం జరుగుతున్న సమయంలో ఆమె బిజెపిలో చేరడం తధ్యం  అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యవహారంపై ఎన్ని రకాల ప్రచారాలు జరుగుతు న్నా, రాములమ్మ మాత్రం ఎక్కడా నోరు మెదపడం లేదు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని కానీ , బీజేపీలో చేరడం లేదు అని కానీ ఎక్కడా విజయశాంతి నోరు మెదపడం లేదు. అయితే తాజాగా ఆమె బిజెపికి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు అనుకూలంగా మాట్లాడడం సంచలనంగా మారింది. 



" గతంలో ఓవైసీ ఎన్నోసార్లు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. పది నిమిషాలు టైం ఇస్తే మా సత్తా చూపిస్తామన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. మేం ఉమ్మేస్తే,చార్మినార్ ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ మునిగిపోతుందని అన్నారు. నేరుగా ఓ డీజీపీ ని పట్టుకుని యూనిఫామ్ వదిలి రా చూసుకుందాం. అని సవాల్ విసిరారు అప్పుడు టిఆర్ఎస్ నేతలు కనీసం ఓవైసీ మాటలను ఖండించలేదు. పైగా ఎంఐఎం , టిఆర్ఎస్ మిత్రపక్షాలు గా చలామణీ అయ్యాయి. ఇటీవల కూడా ఓవైసీ ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని మళ్లీ ఇద్దరు డ్రామాలు మొదలు పెట్టారు.బండి సంజయ్ వ్యాఖ్యల తప్పేముంది నిజంగా కేసీఆర్ కు ధైర్యం ఉంటే పాతబస్తీ మొత్తం సర్వే చేయించాలి. ఇక్కడ ఉన్న రోహింగ్యాలను , పాకిస్తాన్ వాళ్ళను గుర్తించాలి. అంతే కానీ బండి సంజయ్ మీద ఎదురుదాడి చేయడం ఏంటి అంటూ విజయశాంతి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడంతో, ఆమె బీజేపీలో చేరకుండానే మద్దతుగా మాట్లాడటం సరికొత్త రాజకీయమా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: