ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ళపట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇళ్ల పట్టాల పంపిణీ ఆపాలన్న పిటిషన్‌పై విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 ల‌క్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయ‌నున్నారు. న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నవి మినహాయించి మిగిలిన అన్ని స్థలాలు లబ్ధిదారులకు అందజేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 25న ప్రారంభించనున్నారు. దీని కోసం ప్రభుత్వ యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 28న శ్రీకాళహస్తి, 30న విజయనగరం జిల్లా గుంకలాంలో ఇళ్ళపట్టాలను పంపిణీ చేయనున్నారు.

కోర్టు స్టేలు ఉన్న చోట మినహా, మిగతా అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.  లబ్ధిదారులందరికీ డిఫామ్‌ పట్టా ఇచ్చి, ఇంటి స్థలం కేటాస్తారు. తొలి దశలో దాదాపు 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. వీటి మార్కెట్‌ విలువ రూ.23 వేల కోట్లు. మొత్తం 30,68,821 మంది పేదలకు ఇళ్లపట్టాలను అందించనుంది. సొంత స్థలం ఉన్న వారికి 4 లక్షల మందికి లక్ష 80వేల ఆర్థిక సాయం చేస్తామని మంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ పండగ వాతావరణంలో జరుగుతోందన్నారు.

పట్టాలు ఇచ్చిన వెంటనే అదే స్థలంలో ఇళ్ళ నిర్మాణం మొదలు పెడతారు. దీని కోసం కూడా లబ్ధిదారుల ఎంపిక, విధి విధానాల రూపకల్పన వంటి ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. కేంద్ర నిధులను సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టబోతోంది జగన్ సర్కార్.

ఇళ్ళపట్టాల పంపిణీని ఆపేయాలంటూ దాఖలైన పిటిషన్‌ నిలిపేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. పట్టాల పంపిణీపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని తెలిపింది. దీంతో పట్టాల పంపిణీకి మార్గం సుగమమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: