వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్‌ ధరలకు సామాన్యులు అల్లాడిపోతున్నారు. గడిచిన 12 రోజుల్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు కాంగ్రెస్‌ అధినేత్రిసోనియా గాంధీ.

వరుసగా 13 రోజులు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఏడాదిలో మొత్తం 24 సార్లు ధరలు పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 91 రూపాయలు, డీజిల్‌ ధర 81 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోల్‌ ధర 97 రూపాయలుగా ఉండగా...  డీజిల్‌ 87కి చేరింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయలు దాటింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 94రూపాయల 18పైసలు, డీజిల్‌ ధర 88రూపాయల 31పైసలుగా ఉంది.

ఇప్పటికే రాజస్థాన్ లాంటి రాష్ట్రం ప్రజలపై భారం పడకుండా ఉపశమనం కలిగిస్తే... పెట్రోల్, డీజిల్ ధరలపై రూపాయి తగ్గిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌ ధరలపై ఒక రూపాయి ట్యాక్స్‌ను తగ్గించినట్టు తెలిపింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయల 78పైసలు, డీజిల్ ధర 84 రూపాయల 56 పైసలకు చేరుకుంటుంది. మరోవైపు, పెట్రోధరల పెంపుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.

పెట్రోల్‌ ధరల పెంపుపై ప్రధాని మోడీకి లేఖ రాశారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ. చరిత్రలో ఎన్నడూలేని విధంగా పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయని ఆమె గుర్తుచేశారు. కష్టకాలంలో ప్రభుత్వ ఆధాయం పెంచుకోవడం కోసం ప్రజలపై భారం వేయడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా చమురు సంస్థలు ఉత్పత్తి తగ్గించాయని అన్నారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పెట్రోలియం కంపెనీలు కావాలనే తక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తిని తగ్గించవద్దని ఒపెక్ ప్లస్ దేశాలను కోరినట్లు చెప్పారు. కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన ఖర్చుల ప్రభావం కూడా ధరల పెరుగుదలపై ప్రభావం చూపిందన్నారు.  వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆదాయం సంపాదించాలన్న లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలను పెంచుతున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.‌

ఇంధనం ధరల పెంపుపై హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గడిచిన నాలుగేళ్లలో ఇంధనం ధరలు కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే పెరిగాయని అన్నారు. వచ్చిన ఆధాయాన్ని ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే ఖర్చుపెడుతుందన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే హర్యానాలో వ్యాట్‌ తక్కువగా ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: