ఏపీ లో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలో పై చెయ్యి సాధించేందుకు ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ పార్టీలు తమదైన ప్రణాళికలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఉప ఎన్నికకు సమయం ఎక్కువ లేకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా అదికార వైసీపీ, టీడీపీ మధ్య వార్ తార స్థాయికి చేరింది. తాజాగా సోమవారం తిరుపతిలో చంద్రబాబు సభలో రాళ్లు కలకలం రేపాయి. ఓటమికి భయపడి వైసీపీ నేతలే తమపై రాళ్లతో దాడి చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు.  ఆ రాళ్లను చూపిస్తూ.. పోలీసులు ఏమయ్యారని ప్రశ్నిస్తూ చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించిన సంగతి తెలిసిందే. 

అయితే చంద్రబాబు పై ఎటువంటి రాళ్ళ దాడి జరగలేదని, ఆయన సానుభూతి ఓట్లు సంపాధించుకునేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వైసీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రాళ్ళ దాడి ని టీడీపీ ప్రధాన అస్త్రంగా ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతుంది. సి‌ఎం జగన్ కక్ష పూరిత రాజకీయాలతోనే దాడులు చేయిస్తున్నారని, ఉప ఎన్నికలో ఓటమి భయం తోనే సి‌ఎం జగన్ రౌడీల ప్రవర్తిస్తూ ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని టీడీపీ నేతలు రాళ్ళ దాడి ని ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమం లో టీడీపీ ప్రచార వ్యూహాన్ని దెబ్బకొట్టేందుకు వైసీపీ కూడా తగిన ప్రణాళికలు సిద్దం చేసినట్లే తెలుస్తుంది.

 తాజాగా టీడీపీ కార్యకర్త వెంకట్ అనే వ్యక్తికి రాష్ట్ర టీడీపీ అద్యక్షుడు అచ్చెన్నాయుడు కు మద్య జరిగిన సంభాషణ ను ఎత్తి చూపిస్తూ టీడీపీ లో ఉండే లొసుగులను బయటపెడుతుంది వైసీపీ ప్రభుత్వం.  తనకు చంద్రబాబు, లోకేష్ అన్యాయం చేశారంటూ వెంకట్ అనే పార్టీ నేత అచ్చెన్నాయుడు ముందు ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ను వైసీపీ ప్రధాన అస్త్రంగా టీడీపీ ని దెబ్బకొట్టేందుకు ఉపయోగిస్తుంది.. దీంతో ఈ రెండు ప్రధాన పార్టీల మద్య రాజకీయ వేడి మరింత పెరుగుతుంది. టీడీపీ రాళ్ళ దాడి ఆరోపణకు సమాధానంగా టీడీపీ పార్టీ అంతర్గత లొసుగులను బయటపెట్టే వీడియో తో వైసీపీ సిద్దమైంది. దీంతో ఎత్తుకు పై ఎత్తులతో ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మద్య వార్ ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: