ప్రపంచాన్ని కబళించేస్తున్న ఈ కరోనా వైరస్ ఇంకెంత కాలం ఈ భూమిపై ఉంటూ తన ఉగ్రరూపంతో మనుషుల జీవితాన్ని చిత్రవధ చేస్తుందో తెలియడం లేదు. ఏ యాగ యజ్ఞాలు ఈ మాయదారి రోగాన్ని తరిమికొట్టి మట్టుబెడతాయో అర్థంకావడం లేదు. కనికరం లేని ఈ కరోనా ప్రజల ప్రాణాలను చాలా సులువుగా తీసేస్తూ మానవ బంధాలను తెంచేస్తుంది. వారి బతుకుల్లో ఆరని చిచ్చు రగిలిస్తోంది. నిన్న నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో జరిగిన ఒక ఘటనే ఇందుకు నిదర్శనం. నెల్లూరు పరమేశ్వరి నగర్ కు సంభందించిన భారతి ఒక మహిళ తన భర్తకు కరోనా వైరస్ సోకి కాస్త తీవ్రంగా మారడంతో నెల్లూరు లోని నారాయణ హాస్పిటల్ లో చేర్పించింది. అయితే నిన్న ఆమె భర్త...తనకు ఫోన్ చేసి భారతి నాకు ఊపిరి ఆడడం లేదు, పల్స్ పడిపోతుంది, ఇక్కడ ఎవ్వరూ నన్ను పట్టించుకోవడం లేదు..నా ప్రాణం పోయేలా ఉంది నన్ను బ్రతికించు భారతి అని విలవిలలాడాడు.

అది విన్న ఆమె కృగింపోయింది హాస్పిటల్ సిబ్బందికి ఫోన్ చేసింది పరిస్థితిని వివరించి ప్రాధేయపడింది. కానీ వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి అంటూ ఎవరు సరిగా స్పందించలేదు. చివరికి అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి నీ భర్త మరణించాడు అని చాలా సింపుల్ గా చెప్పేశారు. దాంతో ఆమె తన తల్లితో కలిసి హాస్పటల్ కు చేరుకొని భోరున  విలపిస్తూనే ఉంది. అయినా పట్టించుకునే నాథుడు లేడు. పక్క రోజు నారాయణ హాస్పిటల్ కి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారు. ఆయన్ని చూసిన అక్కడి భాదితులు ఆయన్ని నిలదీశారు. భారతి ఆమె తల్లి కూడా ఇదేం న్యాయం అంటూ రోదించారు. కేవలం ఆక్సిజన్ అందించకపోవడం కారణంగానే తమ అల్లుడు మరణించాడంటూ దీనికి మీరేమి సమాధానం చెప్తారని ప్రశ్నించింది. అయినా ఏం లాభం పోయిన ప్రాణం తిరిగి రాదు...ఈ హృదయవిదార గాథ అందరి మనసుల్ని తొలిచేసింది.

ఇకనైనా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఎవరు ఆపగలరు అంటే, ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదు. మరి సాధారణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా... వారికి సహాయం అందించడానికి, అత్యవసర సమయంలో వైద్య సదుపాయాలు కల్పించడం వృధా అని భావిస్తున్నారా... ఏమిటీ నిర్లక్ష్యం ...?? ఎవరిది ఈ బాధ్యత..??  ప్రజాప్రతినిధులారా దయచేసి పేద  ప్రజలకు అండగా నిలబడి  ఈ కరోనా కష్ట కాలంలో కాస్తంత వారికి అండగా నిలబడి వారి ప్రాణాలను రక్షించండి. డాక్టర్లకు కరోనా సోకిన వ్యక్తి ఒక పేషంట్ మాత్రమే కాకపోవచ్చు..కానీ ఓ కుటుంబానికి వాళ్లే అండ.. వారు లేకపోతే ఆ కుటుంబం జీవితం చిన్నాభిన్నం అవుతుంది. దయచేసి ఇకనైనా ఇలాంటివి జరగకుండా వెంటనే స్పందించి వారి ప్రాణాలను కాపాడండి.



మరింత సమాచారం తెలుసుకోండి: