2004 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా ఓట్ల మెజారిటీతో అద్భత విజయం సాధించారు వైఎస్ఆర్. దీంతో ఆయన కృషిని గుర్తించిన అధిష్టానం సీఎం పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే కట్టబెట్టింది. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలను ప్రారంభించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫించన్ల పెంపు లాంటి కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ ఆర్ సంక్షేమ పథకాలతో అనేక మంది లబ్ధిపొందారు. ఆయన వారి గుండెల్లో చిరస్మరణీయుడు అయ్యారు. పెండింగులో ఉన్న నీటి ప్రాజెక్టులను కంప్లీట్ చేయడం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇచ్చారు.
2009 ఏప్రిల్ లో జరిగిన 13వ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. అసెంబ్లీలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించారు. అంతేకాదు లోక్ సభ ఎన్నికల్లో 33స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. రెండో సారి కూడా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారే కానీ.. ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. రచ్చబండ కార్యక్రమం కోసం సెప్టెంబర్ 2వ తేదీన బయల్దేరిన ఆయన హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక నల్లమల అడవుల్లోని పావురాలగుట్టలో కుప్పకూలింది.ఆ ప్రమాదంలో వైఎస్ కన్నుమూశారు. ఆయన మరణం రాష్ట్ర ప్రజలను కంటతడి పెట్టించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి