మంచు విష్ణు మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నిక అయ్యాక ఒక శుభ‌వార్త చెప్పింది ఏపీ స‌ర్కార్. థియేట‌ర్ల‌కు సంబంధించి వంద శాతం ఆక్యుపెన్సీతో పూర్తి క‌రోనా నిబంధ‌న‌లు పాటించి న‌డుపుకోవ‌చ్చ‌ని పేర్కొంది. ఓ విధంగా ఇది జ‌గ‌న్ అందించిన ద‌స‌రా కానుకే ! దీంతో కొంత‌లో కొంత త‌మ‌కు ఊర‌ట ల‌భించినా, పూర్తిగా న‌ష్టాల‌లో ఉన్న త‌మ‌ను గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం ఏదీ ప్ర‌భుత్వం చేయ‌డం లేద‌ని ఆవేద‌న చెందుతున్నారు. ప్ర‌యివేటు ప‌రిధిలో న‌డిచే థియేట‌ర్ల‌ను ప్ర‌భుత్వాలు త‌మ గుప్పిట పెట్టుకునే ఆలోచ‌న‌లో భాగంగా ఆన్ లైన్ టికెటింగ్ ప్రాసెస్ ను ప్ర‌భుత్వ‌మే త‌న సొంత వెబ్సైట్ తో న‌డ‌పాల‌ని భావించ‌డం త‌గ‌ద‌ని అంటున్నారు. కానీ చిత్ర సీమ పెద్ద‌లు దీనిని ఒప్పుకోవడం తో తామేం చేయ‌లేమ‌ని, ఉన్నంత‌లో థియేట‌ర్ల‌ను న‌డిపే సామ‌ర్థ్యం ఉన్నంత వ‌ర‌కూ  ఇవి న‌డుస్తాయ‌ని లేని రోజు మూత ప‌డ‌డం ఖాయ‌మ‌నే అంటున్నారు.


ఇలాంటి దీనావ‌స్థ‌లో ఉన్న థియేట‌ర్ల‌కు జ‌గ‌న్ చేసే సాయం ఏంటి? వంద‌శాతం ఆక్యూపెన్సీ ఇచ్చినంత మాత్రాన స‌మ‌స్య ప‌రిష్కారం కాదు. చిన్న సినిమా విష‌య‌మై ఏదో ఒక రాయితీ ఇస్తే బాగుంటుంది. వినోద‌పు ప‌న్ను మిన‌హాయిస్తే బాగుంటుంది. అదేవిధంగా క‌మర్షియ‌ల్ స్లాట్ లో ఇస్తున్న విద్యుత్ ఛార్జీల‌కు సంబంధించి యూనిట్ ధ‌ర త‌గ్గిస్తే బాగుంటుంది అన్న‌వి వినిపిస్తున్న మాటలు. ఇవేవీ ప‌ట్టించుకోకుండా కేవ‌లం ఆక్యుపెన్సీ వ‌ర‌కే ఆదేశాలు ఇచ్చి ఊరుకుంటే బీ, సీ సెంట‌ర్లే కాదు ఏ క్లాస్ థియేట‌ర్లు కూడా రేప‌టి వేళ ఏదో ఒక షాపింగ్ కాంప్లెక్సులుగా మారిపోవ‌డం ఖాయం. వంద‌ల కుటుంబాలు రోడ్డున ప‌డ‌డం కూడా ఖాయం.


ద‌స‌రా సంద‌ర్భంగా శుభ‌వార్త చెప్పారు ఏపీ సీఎం జ‌గ‌న్. రేప‌టి నుంచి వంద శాతం ఆక్యుపెన్సీ రేటుతో న‌డుపుకోవ‌చ్చ‌న్న‌ది ఆయ‌న ఆదేశం. దీంతో ఇప్ప‌టిదాకా యాభై శాతం ఆక్యుపెన్సీతో నెట్టుకువ‌స్తున్న థియేట‌ర్లకు ఈ వార్త కాస్త ఊర‌ట ఇచ్చేదే! అయితే ఇదే స‌మ‌యంలో క‌రోనా స‌మ‌యంలో తాము చెల్లించని క‌రెంటు బిల్లులు ర‌ద్దు చేయాల‌ని ఎప్ప‌టి నుంచో కోరుతున్నామ‌ని, దాని పై ఓ స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని అంటున్నారు. అదేవిధంగా వినోద‌పు ప‌న్ను, వాణిజ్య ప‌న్ను ఇలా కొన్ని ప‌న్నుల‌పై రాయితీలు ఇవ్వాల‌ని కోరుతున్నామ‌ని వాటిని కూడా ప‌ట్టించుకోవాల‌ని వీరంతా అడుగుతున్నారు. ఇవి ఎలా ఉన్నా ఇప్ప‌టికిప్పుడు పెద్ద సినిమాల రాక లేక‌పోయినా ద‌స‌రా సంద‌ర్భంగా జ‌గ‌న్ నిర్ణ‌యం త‌మ‌కొక ఊర‌ట అని చెబుతున్నారు థియేట‌ర్ల య‌జ‌మానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp