డీఎల్ రవీంద్రారెడ్డి. మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు. క‌డ‌ప జిల్లాలోని మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధించిన నాయ‌కుడిగా.. ప్ర‌జా వైద్యునిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కిర‌ణ్‌కుమార్‌రెడ్డివ మంత్రివ‌ర్గంలో మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న త‌ర్వాత‌.. రాజ‌కీయంగా కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు. ఇక‌, గ‌త రెండు ఎన్నిక‌ల నుంచి మైదుకూరులో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంటోంది. టీడీపీ త‌ర‌ఫున రెండు సార్లు ఇక్క‌డ నుంచి పోటీ చేసిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌.. వ‌రుప ప‌రాజ‌యాలు చ‌విచూస్తున్నారు.

అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. డీఎల్ .. మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్నార‌ని.. టీడీపీ త‌ర‌ఫున ఆయ‌న పోటీ చేయ‌నున్నార‌నే.. ప్ర‌చారం జ‌రిగింది. కాదు.. వైసీపీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. కూడా గుసగుస వినిపించింది. అయితే.. డీఎల్ మాత్రం ఎటూ మొగ్గు చూప‌కుండా.. మౌనంగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆయ‌న వ‌చ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగుతున్న‌ట్టు చెప్పారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తారు? అనే చ‌ర్చ తెర‌మీదికివ‌చ్చింది. ఇప్ప‌టికిప్పుడు ప‌రిణామాలు చూసుకుంటే.. ఇటు వైసీపీలోకి వ‌చ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. తాజాగా కూడా ఆయ‌న జ‌గ‌న్ పాల‌న‌పై విరుచుకుపడ్డారు.

ఇక‌, టీడీపీలోకి వెళ్లాలంటే.. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ నియోజ‌క‌వ‌ర్గాన్ని వీడ‌డం లేదు. దీంతో ఈ రెండు పార్టీల్లోనూ డీఎల్‌కు అవ‌కాశం ద‌క్క‌డం క‌ష్ట‌మే. ఇక‌, మిగిలింది.. జ‌న‌సేన. మ‌రి ఈ పార్టీవైపు డీఎల్ ఎంత వ‌ర‌కు మొగ్గు చూపుతారో తెలియాల్సి ఉంది. ఒక‌వేళ డీఎల్ వ‌స్తే.. జ‌న‌సేనాని ప‌వ‌న్ ఆయ‌న‌ను పార్టీలోకి ఆహ్వానించే అవ‌కాశం మెండుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అలాకాద‌ని.. కాంగ్రెస్‌లోనే ఉంటారా?  ఆ పార్టీ టికెట్‌పైనే పోటీ చేస్తారా ? అనేది కూడా స‌స్పెన్స్‌గా ఉంది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రిస్థితి 2014 నాటి ప‌రిస్థితిలోనే ఉండ‌డంతో ఆ పార్టీ త‌ర‌ఫున డీఎల్ పోటీ చేసినా.. ప్ర‌యాస త‌ప్ప‌.. ఏమీ ల‌భించ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: