కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా? ఎన్డీయే, ఇండియా కూటమి కాకుండా థర్డ్ ఫ్రంట్ రాబోతుందా? బీజీపీ కూటమి 200 స్థానాలకే పరిమితం కాబోతుందా? అంటే బీఆర్ఎస్ అధినేత అవుననే అంటున్నారు. పెద్ద రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు కలిసి థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇదేమీ అసంభవం కాదని కేసీఆర్ చెబుతున్నారు.


మొత్తం మీద లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంకీర్ణం అనే బాంబ్ పేల్చారు. నామాకు కేంద్ర మంత్రి పదవి యోగం ఉందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. మొదటి రెండు విడతల పోలింగ్ సరిళిని పరిశీలిస్తే బీజీపీ కూటమికి గానీ, ఇండియా కూటమికి గానీ సానుకూల పవనాలు లేవని.. అందుకే లోక్ సభ ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు జరుగుతాయని కేసీఆర్ అంటున్నారు.


తెలంగాణలో గౌరవ ప్రదమైన సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో చక్రం తిప్పొచ్చు అని గులాబీ బాస్ భావిస్తున్నారు. శాసన సభ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీని లోక్ సభ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన సీట్లు సాధించేందుకు, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు కేసీఆర్ బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ సందర్భంగా సంకీర్ణం అనే వ్యాఖ్యలు చేశారు.


ఇవి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే.. ప్రస్తుతం దేశంలోని అన్ని పార్టీలు అటు ఎన్డీయే కూటమిలోను, లేక ఇండియా కూటమిలోను ఉన్నాయి. ఒకటి రెండు పార్టీలు ఏ కూటమికి మద్దతు తెలపకున్నా.. ఎన్నికల తర్వాత ఏ పార్టీ మెజార్టీకి దగ్గరగా ఉంటే వాటికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి సంకీర్ణ ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందో మిలియన్ డాలర్ల ప్రశ్న. నామాకు కేంద్ర మంత్రి పదవి అంటే తన అవసరం బీజేపీకి ఉందని చెప్పకనే చెబుతున్నారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎక్కువ సీట్లు సాధించేందుకు కేసీఆర్ పన్నిన వ్యూహంగా మరికొందరు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: