ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ పై రాళ్లదాడి తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం లో భాగంగా చేపట్టిన బస్సు యాత్ర విజయవాడలోని సింగ్ నగర్ కు చేరుకోగానే వైసీపీ అధినేత, సీఎం జగన్ పై రాళ్లదాడి జరిగింది. దీంతో ఈ విషయం రాజకీయంగా కలకలం రేపింది.


అయితే ఈ దాడిని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు చేయించారని వైసీపీ నేతలు, దాని అనుకూల మీడియా కోడై కూసింది. చంద్రబాబు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం మూలంగానే వారు రెచ్చిపోయి జగన్ ను అంతం చేయాలని చూశారని.. దీనికి ముఖ్య కారణం చంద్రబాబే అని పేర్కొంది. అయితే జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా టీడీపీ అధినేతపై హత్యాయత్నం నిందలు వేసిన విషయం తెలిసిందే.


వైఎస్ వివేకానందారెడ్డి, కోడికత్తి దాడి విషయంలో చంద్రబాబునే చేయించారని గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రతి సభ, ర్యాలీ, రోడ్ షోలో ప్రచారం చేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు. వాస్తవంగా చంద్రబాబు చేయిస్తే.. వీటిని నిరూపించి చంద్రబాబుని దోషిగా ప్రజల ముందు నిలబెట్టొచ్చు. కానీ ఈ రెండు కేసుల్లో ఇలాంటి ఘటనలు ఏమీ జరగలేదు. ఈ కేసులను ముందుకు తేల్చడం లేదు.


ఇప్పుడు తాజాగా గులకరాయి కేసు కూడా అంతే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ రాజకీయాల్లో నాయకుల మధ్య చంపించుకునేంత శత్రుత్వం ఉండదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. రాజకీయంగా ఇరు నేతల మధ్య వైరం ఉంటుంది కానీ.. ఒకరిని ఒకరు అంతమొందించే కోపం వారి మధ్య లేదని.. ఒకవేళ అలా చేస్తే ప్రజలు కూడా నమ్మరని.. వారి రాజకీయ భవిష్యత్తు అక్కడితో ముగుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం చేసే ఆరోపణలు తప్ప మరేదీ లేదని కొట్టి పారేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: