హుజురాబాద్ ఉప ఎన్నిక.. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాజకీయాలను ఊపేస్తుంది ఈ ఉప ఎన్నిక.  ఇప్పుడు వరకు తెలంగాణలో ఎన్నోసార్లు ఉప ఎన్నికలు జరిగాయి. కానీ హుజురాబాద్ ఉప ఎన్నికల రేంజ్ లో మాత్రం ఏ ఉప ఎన్నిక కూడా రాజకీయాలను వాడివేడిగా మార్చలేదు అని చెప్పాలి. దీనికి కారణం టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి  ఏకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే సవాల్ విసరడం.  దీంతో ఇక ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.



 అధికార టీఆర్ఎస్ పార్టీ పరువు నిలబెట్టుకోవాలి అంటే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడం తప్పనిసరిగా మారిపోయింది. ఇక బిజెపి తరఫున ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండగా టిఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.   అటు అధికార పార్టీ కీలక నేతలు రంగంలోకి దిగి హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడ వాడ తిరుగుతూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటెల రాజేందర్ కూడా తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  అయితే ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్న టిఆర్ఎస్ ముఖ్య నేతలందరూ ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇటీవల హుజురాబాద్ ప్రచార సభలో పాల్గొన్న తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఈటెలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతో ఈటెల రాజేందర్ ఉన్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఓడిపోతానన్న ప్రెస్టేషన్  లో  ఈటెల రాజేందర్ విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ హరీష్ విమర్శలు గుప్పించారు. ఈటెల గెలిస్తే బిజెపి ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను ఓడించేందుకు కేవలం బీజేపీ రాష్ట్ర నేతలే కాదు ఏకంగా కేంద్ర మంత్రులు సైతం హుజురాబాద్ రోడ్లపై తిరుగుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. హుజురాబాద్ లో మరోసారి టిఆర్ఎస్ విజయం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: