వాళ్లంతా నిరుపేద విద్యార్థులు.. అతి సామాన్య పేద కుటుంబాల నుంచి వచ్చినవారు. అంతేకాదు. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వారు.. నారాయణ, చైతన్య వంటి ఇన్‌స్టిట్యూట్లలో లక్షలు పోసి తీసుకునే కోచింగ్‌ లేకపోయినా వారు.. ఐఐటీ సీట్లు కొట్టేశారు.. వారే గురుకులాల విద్యార్థులు.. అవును.. ఏపీలోని  సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలనుంచి ఇప్పటివరకూ 179 మంది వివిధ ఐఐటీలు, ఐఐటీల్లో ప్రిపరేటరీ కోర్సులు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు సాధించి సత్తా చాటారు.


ఈ ఐఐటీ, ఇతర ప్రముఖ సంస్థల్లో సీట్లు పొందబోతున్న ఈ ఎస్టీ విద్యార్థుల్లో 9 మంది ఐఐటీలకు ఎంపికయ్యారు. 21 మంది  ఎస్టీలు ప్రిపరేటరీ కోర్సులకు ఎంపికయ్యారు. మరో 59 మంది ఎస్టీలు ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఇతర కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించుకున్నారు. వీరే కాదు.. ఎస్సీలనుంచి 13 మంది ఐఐటీలకు ఎంపికయ్యారు. మరో 34 మంది ఎస్సీ విద్యార్థులు ప్రిపరేటరీ కోర్సులకు సెలక్ట్ అయ్యారు. 43 మంది ఎస్సీ విద్యార్థులు ఎన్‌ఐటీ, ఐఐఐటీ, కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించారు.


అయితే.. ఇంకా కౌన్సిలింగ్‌ జరుగుతూనే ఉంది. అందువల్ల మరింత మందికి ర్యాంకులు వచ్చే అవకాశం  కూడా ఉంది. ఇవే కాదు.. ఇంకా నీట్‌, ఇతర వైద్య సంస్థల ఫలితాలు కూడా రావాల్సిఉంది.  వీటిలో కూడా గురుకుల ర్యాంకులు సాధించే అవకాశం ఉంది.


ఇలా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాజాగా సీఎం జగన్‌ను కలిశారు. ఐఐటీ సహా ఇతర ఉన్నత విద్యా ప్రవేశాల కోసం పరీక్షలు రాసి ర్యాంకులు కొట్టిన మెరికల్లాంటి విద్యార్థులను సీఎం వైయస్ జగన్‌ మెచ్చుకున్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ మట్టిలో మాణిక్యాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం జగన్ వీరిలో ప్రతి ఒక్కరినీ ఆసక్తిగా పరిచయం చేసుకున్నారు. వారి వారి నేపథ్యాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

iit