కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. ఏడు కొండలపై కొలువైన ఆ కోనేటి రాయుని దర్శనానిని భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. కరోనా వైరస్ ముందు ప్రతి రోజు దాదాపు 40 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే వారు. కానీ కరోనా వైరస్, లాక్ డౌన్ తర్వాత... భక్తుల రాకపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు విధించింది. తొలి రోజుల్లో కేవలం రోజుకు 4 వేల మందిని మాత్రమే అనుమతించింది. ఆ తర్వాత ఆ సంఖ్యను క్రమంగా 15 వేల వరకు పెంచింది. మొదట్లో కేవలం ఆన్ లైన్ ద్వారా ముందుగా దర్శనం చేసుకున్న వారికి స్వామి వారి దర్శన భాగ్యం కలిగించిన టీటీడీ... ఇప్పుడు సర్వ దర్శనం టికెట్లు కూడా జారీ చేస్తోంది. ప్రస్తుతం శ్రీవారి పలు సేవలు కూడా వర్చువల్ విధానంలోనే నిర్వహిస్తోంది టీటీడీ. ప్రధానంగా కల్యాణోత్సవం.

అయితే దాదాపు 15 రోజులుగా తిరుమల, తిరుపతి పట్టణాలపై వరుణుడు పగ బట్టినట్లుగా కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుపతి పట్టణం దాదాపు మూడు రోజుల పాటు నీటిలోనే నానిపోయింది. వీధులన్నీ చెరువులని తలపించాయి. ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇక తిరుమలలో కురిసిన భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు ఘాట్ రోడ్లు పూర్తిగా మూసివేశారు. అలిపిరి మెట్టు, శ్రీవారి మెట్టు మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నాలుగు రోజుల పాటు అన్ని మార్గాలను టీటీడీ మూసివేసింది. నెమ్మదిగా ఘాట్ రోడ్డులు ప్రారంభించింది టీటీడీ. కానీ తాజాగా మరోసారి కొండ చరియలు పడి రహదారి ధ్వంసం అయ్యింది. దీంతో ఆన్ లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని వారం రోజుల పాటు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు టీటీడీ  ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. దర్శన టికెట్లు రీ షెడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో వర్షాలు కురిశాయని... దీంతో భక్తుల రక్షణ కోసమే ఈ సూచన  చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి మొదటి ఘాట్ రోడ్డు ద్వారా వాహన రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: