రూ. 3లక్షలు లంచం ఇస్తే చాలు.. ఆర్టీసీలో ఉద్యోగం రెడీగా ఉంది.. ఏంటి..నిజంగానే అనుకుంటున్నారా.. కాదులెండి.. కానీ.. ఇలా ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసే మోసగాళ్లు బాగా పెరిగిపోయారట. గతంలో ఆర్టీసీలో పని చేసే ఉద్యోగులే కొందరు.. తమకు ఉన్నత స్థాయిలో అధికారులతో పరిచయాలు ఉన్నాయని.. ఆ ఉద్యోగం.. ఈ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. లక్షలకు లక్షలు సొమ్ములు మింగి.. ఆ తర్వాత పని కాలేదని ముఖం చాటేసేవాళ్లు.. గతంలో ఇలాంటి కేసులు చాలా వచ్చాయి.


అయితే ఇప్పుడు మోసగాళ్లు మరీ తెలివి మీరిపోయారు. నిరుద్యోగుల ఆశలను క్యాష్ చేసుకునేందుకు కొత్త రకం మోసాలు మొదలు పెట్టేశారు. అందుకే ఏపీఎస్ ఆర్టీసీ సంస్థలో  ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.
ఏపీఎస్ ఆర్టీసీ పేరిట నకిలీ మెయిల్స్ ను సృష్టించి మోసం చేస్తోన్న నవీన్ కుమార్ అనే వ్యక్తి గురించి ఓ ప్రకటన విడుదల చేసింది.


ఈ నవీన్‌ కుమార్ అనే వ్యక్తి.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు, ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి పేర్లతో అపాయింట్ మెంట్ ఆర్డర్లు సృష్టించి మోసం చేస్తున్నాడట. అపాయింట్ మెంట్ ఆర్డర్లతో డబ్బులు వసూలు చేస్తున్నాడట. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, మదనపల్లి, పలమనేరు డిపోల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం  చేస్తున్నాడట. ఇప్పటికే ఇతని చేతిలో మోసపోయిన అనేక మంది  ఈ విషయం తెలుపుతూ ఏపీఎస్ ఆర్టీసీ అధికారులను ఆశ్రయించారు.


నవీన్ కమార్ చేసిన మోసంపై ఇప్పుడు ఆర్టీసీ పోలీసులకు  ఫిర్యాదు చేసింది. మోసపూరిత  వ్యవహారంపై ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. నవీన్ కుమార్ తో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కొందరు నకిలీఈ మెయిల్స్ ద్వారా నిరుద్యోగులను, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని.. ఆర్టీసీ దిన పత్రికల్లో నోటిఫికేషన్  ఇచ్చిన తర్వాతే సంస్థ ఉద్యోగాల భర్తీ చేస్తుందని వివరిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగాల కోసం దళారులు, మధ్యవర్తులను ఎట్టి పరిస్ధితుల్లో అనుమతించదని తెలుపుతున్నారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తులను గుర్తిస్తే పోలీసులకు తెలపాలని  ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: