ఏపీ సర్కారు ఉద్యోగులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఫిట్‌మెంట్ విషయంలో సర్కారు ఉద్యోగులను తీవ్రంగా నిరాశ పరిచింది. మధ్యంతర భృతి 27 గా ఉంటే.. ఇప్పుడు జగన్ సర్కారు ఫిట్‌మెంట్‌ను 23 శాతానికే పరిమితం చేసింది. అయితే.. ఇప్పుడు ఈ 9 నెలల మధ్యంతర భృతిని గణించి.. ఉద్యోగి అదనంగా పొందినట్టు తేలితే.. ముందు ముందు ఉద్యోగి జీతం నుంచి కోత విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తే బకాయిలుగా జమ చేయొచ్చని చెబుతున్నారు.


జగన్ ప్రభుత్వం  2019 జులై నుంచి 2020 మార్చి వరకు ఐఆర్‌ రూపంలో రూ.5,375 కోట్ల వరకు ఇచ్చి ఉంటుందని ఓ అంచనా ఉంది. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు లెక్కేస్తున్నారు. 9 నెలల ఐఆర్‌ మొత్తాన్ని కలిపి లెక్కలేసి.. ఉద్యోగికి ఇంకా ఇవ్వాలా? లేదా ఉద్యోగి నుంచే వెనక్కి తీసుకోవాలా అన్నది తేలుస్తారు. జగన్ సర్కారు 23 శాతం ఫిట్‌మెంట్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని భావిస్తే.. మాత్రం ఈ 9 నెలలు అదనంగా వచ్చిన మొత్తాన్ని జీతాల్లో నుంచి కోత వేస్తారన్న వాదన ఉంది.


అయితే.. ఇప్పటి వరకూ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదని.. మధ్యంతర భృతిగా కల్పించిన లబ్ధిని తిరిగి సర్దుబాటు చేయడం ఎప్పుడూ లేదంటున్నారు ఉద్యోగులు. జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే 2019 జులై నుంచి 27శాతం ఐఆర్‌ అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు జీతాల్లో కోత విధిస్తే.. జగన్ తాను ఇచ్చిన హామీని తానే తుంగలో తొక్కినట్టు అవుతుందని చెబుతున్నారు.


ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. 2020 ఏప్రిల్‌ నుంచి 2021 డిసెంబర్‌ వరకు పొందిన లబ్దిని జీపీఎఫ్‌ ఖాతాలకు తరలిస్తారు. 2022 జనవరి నుంచి నగదు రూపంలో జీతంతో కలిపి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కొత్త పీఆర్సీ అమలు ఎలా చేస్తారో జీవోల్లోనే క్లారిటీ ఇచ్చేసింది. ఈ  కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగులు, పెన్షనర్లకు ఏడాదికి రూ.10,247 కోట్ల అదనపు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: