మేడారం సమ్మక్క, సారక్క జాతర సందడి మొదలైంది. అసలైన జాతర ప్రారంభం కాకముందు నుంచే భక్తులు మేడారానికి పోటెత్తుతుంటారు. అసలైన జాతర సమయంలో రద్దీని తట్టుకోలేక చాలా మంది ముందుగానే అమ్మవారిని దర్శించుకుంటుంటారు. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతర ప్రసాదానికి చాలా ప్రాశస్త్యం ఉంది. అలాగే.. భక్తులు తాము కోరుకున్న కోరికలు తీరితే మేడారం వెళ్లి బంగారం పేరుతో బెల్లాన్ని కానుకగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.


అయితే కొందరు భక్తులు అనేక కారణాలతో మేడారం వెళ్లలేకపోవచ్చు. అలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు సమ్మక్క ప్రసాదాన్ని భక్తుల ఇంటికే తెచ్చి అందివ్వబోతున్నారు. మేడారం ప్రసాదాన్నిడోర్‌ డెలివరీ చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్టీసీ, తపాలా, ఐటీశాఖల సహకారంతో డోర్ డెలివరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 12-22 వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఇంటికే ప్రసాదం సేవలు అందుకోవచ్చు.


ఇక సమ్మక్క సారలమ్మలకు బెల్లం.. అదేనండీ బంగారం కానుకగా ఇ‌వ్వాలనుకుని మేడారం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ఓ సౌకర్యం ఏర్పాటు చేస్తోంది. భక్తులు తమ బెల్లాన్ని ఆర్టీసీ ద్వారా కూడా అమ్మవార్లకు చేర్చవచ్చు. భక్తులు ఇంటి నుంచే బంగారం అమ్మవారికి పంపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు
చేస్తోంది. ఆర్టీసీ సిబ్బంది భక్తుల ఇంటికి వచ్చి ప్రసాదం తీసుకెళ్లనున్నారు. బంగారం అమ్మవారికి సమర్పించి మళ్లీ భక్తులకు ఇవ్వనున్నారు. దీని కోసం మీ సేవ ద్వారా కానీ.. టీయాప్ ఫోలియో ద్వారా కానీ భక్తులు బుక్ చేసుకునే అవకాశం ఉంది.


మేడారం జాతర.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా చెబుతారు. ఈ జాతరను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి అందుకు తగిన ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గడం కాస్త ఆనందించే పరిణామమే అయినా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: