సైనిక చర్య మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 18వేల మంది రష్యా సైనికులు హతమైనట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో పాటు 644యుద్ధ ట్యాంకులు, 1830 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. 143యుద్ధ విమానాలు, 134 హెలికాప్టర్లు, 89 యూఏవీలను నేలకూల్చినట్టు వెల్లడించింది. వీటికి అదనంగా 7నౌకలు, 54విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్టు తెలిపింది.

ఇంగ్లండ్ లో తయారైన స్టార్ స్ట్రీక్ మిసైల్ సాయంతో రష్యా ఎంఐ-28 ఎన్ హెలికాప్టర్ ను ఉక్రెయిన్ కూల్చి వేసింది. మిసైల్ ఢీకొట్టడంతో హెలికాప్టర్ రెండు ముక్కలై నేలకూలింది. స్టార్ స్ట్రీక్ మిసైల్ ప్రయోగంపై రష్యా మండిపడింది. ఇకపై ఇంగ్లండ్ ఆయుధ సరఫరా నౌకలు, వాహనాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతామని హెచ్చరించింది. ఇప్పటి వరకు రష్యా 143యుద్ధ విమానాలు, 131 హెలికాప్టర్లు, 625 ట్యాంకులను కోల్పోయింది.

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేశారు. రష్యాను ఆపకపోతే ప్రపంచ భద్రతకు పెద్ద చిక్కులు వస్తాయని హెచ్చరించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ ను ఉద్దేశించి వర్చువల్ గా జెలెన్ స్కీ ప్రసంగించారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి పెట్టుబడులు పెట్టాలని దేశాలు, కంపెనీలకు పిలుపునిచ్చారు. నల్ల సముద్రం వెంబడి ఓడరేవులు, నగరాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు.

మరోవైపు మరో దఫా చర్చల కోసం రెండు వారాల్లోపు రష్యా, ఉక్రెయిన్ ల విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోస్, దిమిత్రో కులేబాలు సమావేశమవుతారని టర్కీ తెలిపింది. వారం లేదా రెండు వారాల్లో ఉన్నత స్థాయి సమావేశం ఉంటుందనీ.. కనీసం విదేశాంగ మంత్రుల స్థాయిలో సమావేశం జరగొచ్చని టర్కీవిదేశాంగ మంత్రి మెవ్ లుట్ కావూసోగ్లు చెప్పారు. ఇటీవల టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ఇరు పక్షాల చర్చల్లో కాస్త పురోగతి కనిపించింది.

ఇక ఉక్రెయిన్ కు మరో 300మిలియన్ల అదనపు సాయం అందించాలని అమెరికా నిర్ణయించింది. రష్యా సైనిక దాడి చేసినప్పటి నుంచి 1.6బిలియన్ల డాలర్ల ఆర్థికసాయంతో పాటు దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు భద్రతా సాయం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన సాయంతో లేజర్ గైడెడ్ రాకెట్ సిస్టమ్ లు, డ్రోన్ లు, మందుగుండు సామాగ్రి, నైట్ విజన్ పరికరాలు, వ్యూహాత్మక సురక్షిత సమాచార వ్యవస్థలు, వైద్య సామాగ్రి, విడి భాగాలు అందించనున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: