
పొత్తులో ఉన్న పార్టీలు నూటికి నూరు శాతం ఒకే అభిప్రాయంతో ఉండక్కర్లేదని అన్నారు పవన్ కల్యాణ్. 30శాతం వరకు విభేదించొచ్చని చెప్పారు. విసాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా తాము కేంద్రంతో విభేదిస్తున్నామని అన్నారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై కూడా కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇక ఏపీ విషయానికొస్తే తాము ఎవరి పల్లకీ మోయాలనుకోవడంలేదని, ప్రజల పల్లకీని మాత్రమే మోస్తామంటున్నారు.
పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేది లేదని చెబుతున్న పవన్ ఎలాగోలా బీజేపీ నుంచి బయటకు రావాలని చూస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. పవన్ పెట్టిన మీటింగ్ తో ఆ విషయం స్పష్టమైందని అన్నారు. అది పవన్ పార్టీ మీటింగ్ కాదని, బాబూ వచ్చేస్తున్నా అనే మీటింగ్ అని ఎద్దేవా చేశారు అంబటి.
పోనీ వైసీపీ మాటల్ని సీరియస్ గా తీసుకోకపోయినా పవన్ మనసులో కూడా బీజేపీకి దూరమయ్యే ఆలోచనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ కూడా టీడీపీతో కలసి రావాలనుకుంటే మాత్రం పవన్ విభేదించరు. అదే సమయంలో టీడీపీని బీజేపీ దూరం పెడితే మాత్రం పవన్ కమలం పార్టీకి దూరం జరుగుతారనడంలో ఎలాంటి అనుమానం లేదు.